Vizianagaram: అక్టోబర్ 1నే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: మంత్రి కొండపల్లి
Vizianagaram: అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇంటివద్దే పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
Vizianagaram: అక్టోబర్ 1నే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: మంత్రి కొండపల్లి
విజయనగరం: రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గతంలో ప్రకటించినట్టుగా సవరించిన వేళలతో సంబంధం లేకుండా, ఎప్పటిలాగే అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బ్యాంకు ఉద్యోగులు తమ సమ్మెను విరమించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే పింఛన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.
సెప్టెంబర్ 30వ తేదీనే స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సిబ్బంది బ్యాంకుల నుంచి 100% పింఛను నగదును విత్‌డ్రా చేసుకుని.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల నగదు అందజేస్తారని తెలిపారు. అక్టోబర్ నెలకు గాను ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692.34 కోట్లను విడుదల చేసిందని.. ఇందులో రూ.2,692.28 కోట్లను పంచాయతీ / వార్డుల ఖాతాలకు జమ చేయగా, రూ. 6 లక్షలను గజపతినగరం మండలంలోని NSAP పింఛనుదారుల ఖాతాలకు డీబీటీ (DBT) ద్వారా జమ చేస్తారని మంత్రి పేర్కొన్నారు.
ఈ నెల 30 నాటికి అవసరమైన నగదు సిద్ధంగా ఉండేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు (PDs), ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, SLBC మరియు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారులకు ప్రతి నెలా 1వ తేదీనే సకాలంలో పింఛన్లు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు.




