Anakapalli: ప్రతి నెల 1న ‘వెల్ఫేర్ డే’: కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం
Anakapalli: ప్రతి నెల 1న వెల్ఫేర్ డే నిర్వహించాలని, అధికారులు నెలకు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు.
Anakapalli: ప్రతి నెల 1న ‘వెల్ఫేర్ డే’: కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం
అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సర్వీసులపై ప్రజల సంతృప్తిని (Positive Public Perception - PPP) మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని, ఇందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీని 'వెల్ఫేర్ డే'గా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు ప్రతి ఒక్కరూ విధిగా ఫీల్డ్‌లోనే ఉండాలని ఆదేశించారు.
ఈనెల 10 మరియు 11 తేదీలలో అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సదరు అంశాలపై అధికారులతో చర్చించి, దిశా నిర్దేశం చేసేందుకు గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..... ప్రతి నెల మొదటి తేదీన ఉదయం పింఛన్ల పంపిణీ అనంతరం అధికారులు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, జల జీవన్ మిషన్, పంచాయతీ రాజ్ రహదారి పనులు, అన్న క్యాంటీన్లను ప్రత్యక్షంగా తనిఖీలు చేయాలన్నారు.
ప్రభుత్వ సేవలు, శాఖల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని ప్రతి నెల కనీసం 5% పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం 80% అభిప్రాయం ఉన్న శాఖలు వచ్చే నెల నాటికి దానిని 85%కి తీసుకెళ్లాలని, హెల్త్, విద్యుత్, రోడ్లు, ట్రాన్స్‌పోర్ట్, రెవెన్యూ, అన్న క్యాంటీన్లు, తాగునీరు, మైనింగ్ తదితర శాఖలు ప్రజలలో తమ పనితీరు పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుకునేలా పనిచేయాలని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందేలా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
రాష్ట్ర జిఎస్‌డీపీ మరియు ఇతర ముఖ్యమైన ఆర్థిక గణాంకాల లెక్కింపునకు బేస్ ఇయర్‌ను 2022-23గా సవరించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆర్థిక నివేదికల రూపకల్పనలో కీలక మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో, విభాగాల వారీగా డేటా సేకరణ, నమోదు ప్రక్రియపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రతి నెలా 5వ తేదీ కల్లా అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని సమాచారాన్ని, కేపీఐ డేటాను పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని, ఈ డేటా ఆధారంగా ప్రతి నెలా 9వ తేదీన జిల్లా ఆర్థిక నివేదిక విడుదలవుతుందని కలెక్టర్ తెలిపారు. డేటా నమోదులో తప్పులు చేసినా, ఆలస్యం చేసినా అది నివేదికల్లో స్పష్టంగా రికార్డవుతుంది కాబట్టి ప్రతీ అధికారి సరైన సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలని సూచించారు. డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, ప్రతీ నెల 5వ తేదీ నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల పరిష్కారం మరియు ప్రజల ఫిర్యాదుల (PGRS) విచారణలో కొందరు జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ-ఆఫీస్ (e-Office) డేటాను ప్రస్తావిస్తూ అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇ-ఆఫీస్ డేటా ప్రకారం కొందరు అధికారులు ఒక ఫైలును పరిష్కరించడానికి చాలా రోజుల వరకు సమయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే ఫిర్యాదులను అధికారులు తీవ్రంగా పరిగణించడం లేదని, ఒకరిద్దరు చేసే నిర్లక్ష్యం వల్ల మొత్తం జిల్లా సగటు సమయం దెబ్బతింటోందని స్పష్టం చేశారు. ఏ శాఖ పరిధిలోకి వచ్చిన ఆర్జీని ఆ శాఖ అధికారులు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించకపోతే, సదరు అధికారులకు వెంటనే 'షోకాజ్ నోటీసులు' జారీ చేస్తామని హెచ్చరించారు.
ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మందకొడి పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని, ఇకపై ప్రతి జిల్లా అధికారి ఫైళ్ల పరిష్కార సమయాన్ని పెంచుకోవాలని స్పష్టం చేశారు. డీఆర్‌ఓ రోజూ ఈ ఫైళ్ల స్థితిగతులను పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లా స్థాయిలో అధికారుల పనితీరు, శాఖాపరమైన అంశాలపై అవగాహన లేకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలపై వచ్చే ప్రతికూల, అసత్య ప్రచారాలను తక్షణమే ఖండించి ఐ&పిఆర్ (I&PR) సమాచార పౌరసంబంధాల శాఖకు స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులే ఐ&పిఆర్ కి సరైన సమాచారాన్ని అందించి, ఆ నిజాలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం చేయాలన్నారు.
గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులకు ప్రభుత్వ పథకాలు, విధులపై కనీస అవగాహన ఉండకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. అధికారులు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి ఫీల్డ్ విజిట్‌లు చేయాలని, విషయాలు నేర్చుకోవాలని స్పష్టం చేశారు.
మూతపడిన ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణ, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ల రద్దుపై కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, జిఎస్‌టి (GST) వంటి కీలక ఆదాయ వనరుల శాఖల అధికారులు నిర్దేశించుకున్న రాబడి లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న రికవరీలను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో పనిచేయకుండా మూతపడిన MSME పరిశ్రమల జాబితాను సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ, డిఆర్‌డిఎ, మెప్మా మరియు విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ కనెక్షన్లు, బిల్లుల చెల్లింపుల డేటా ఆధారంగా ఇవి క్రియాశీలకంగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలని, ఫీల్డ్ విజిట్లు చేసి పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఏడాది చివరినాటికి కనీసం 30% మూతపడిన ఎంఎస్‌ఎంఈలను తిరిగి పునరుద్ధరించాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.
లేఅవుట్లలో ఇళ్ల స్థలాలకు సంబంధించి అనర్హులపై (Ineligible) పెండింగ్‌లో ఉన్న విచారణలను తక్షణమే పూర్తి చేయాలని డిఆర్‌వో ను ఆదేశించారు. విచారణ పూర్తయ్యాక, అనర్హులకు ఇచ్చిన నోటీసుల ప్రకారం వారి పేరుమీద ఉన్న పాత రిజిస్ట్రేషన్ డీడ్లను రద్దు చేయాలని, ఆ స్థలాలను కొత్తగా అర్హులైన వారికి కేటాయించాలని సూచించారు. దీనిపై వచ్చే వారంలోగా కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలన్నారు. G.O.Ms 30 కింద ఉన్న క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎల్నినో ప్రభావంపై చర్చించిన తర్వాత అదృష్టవశాత్తూ జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ, ఆ వర్షాల ప్రభావం పంటల సాగు విస్తీర్ణంలో తగినంతగా కనిపించడం లేదని కలెక్టర్ పేర్కొంటూ, రెవెన్యూ, వ్యవసాయం, పశుసంవర్ధక, తాగునీటి సరఫరా శాఖల అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పశువులకు, ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో పురోగతి ఆశాజనకంగా లేదన్నారు. గ్రామాల వారీగా పశువుల నీటి తొట్టెల (Cattle Troughs) లభ్యత, వాటిలో నీటిని నింపే వ్యవస్థ ఉందో లేదో తనిఖీ చేయాలని పశుసంవర్ధక శాఖను ఆదేశించారు. పశుగ్రాసం మరియు పొడి గ్రాసం సరఫరాపై తక్షణమే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
పంటల సాగు విస్తీర్ణం పెంపుపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతీ ఎకరాకూ ఇన్సూరెన్స్ కవరేజ్ అందుతోందో లేదో పరిశీలించాలన్నారు. ప్యాడీ (వరి) నారుముళ్లు, ఊడ్పులు లేదా డ్రై సోయింగ్ (పొడి సాగు) ఏది వీలైతే అది చేపట్టి, ఖాళీగా ఉన్న ప్రతి భూమిని సాగులోకి తీసుకురావాలని వ్యవసాయ, హార్టికల్చర్ శాఖ అధికారులకు తేల్చి చెప్పారు.
జిల్లాలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు తగినంత పరిమాణంలో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా అత్యంత సున్నితమైన అంశమని, ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదని కఠినంగా హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 50 లక్షల మేర నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ నీటి రవాణా అవసరం లేకుండానే తాగునీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు.
ఎలమంచిలి, నర్సీపట్నం మరియు అనకాపల్లి పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సరిపడా తాగునీటి సరఫరాను యంత్రాంగం ఖచ్చితంగా నిర్ధారించాలని ఆదేశించారు. నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి సాకులు చెప్పడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.
జలధార పథకం కింద ప్రతిపాదించిన పనులన్నింటినీ కవర్ చేయాలని, ఈ విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రస్తుతం కురుస్తున్న స్వల్ప వర్షాల నీరు వృథా కాకుండా, ఆ నీటిని ఫామ్ పాండ్స్ (రైతు కుంటలు/సాగు నీటి కుంటలు) లోకి మళ్లించి నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులు ఫీల్డ్ విజిట్స్‌కు వెళ్లాలని, నెలకు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయి పరిశీలనలో ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ర్యాంకింగ్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకింగ్ దిగువన ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జిల్లాను ముందంజలో నిలపాలని పిలుపునిచ్చారు. రాబోయే కలెక్టర్ల సమావేశం నాటికి అన్ని విభాగాల పనితీరు మెరుగుపడాలని అధికారులకు ఆదేశించారు.




