Madhurawada: మధురవాడ బాయ్స్ హాస్టల్‌లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
Madhurawada: మధురవాడ సాంఘిక సంక్షేమ బాయ్స్ హాస్టల్‌ను విశాఖ కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు, లక్ష్యాలపై స్ఫూర్తినిచ్చారు.
Madhurawada: మధురవాడ బాయ్స్ హాస్టల్‌లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
Madhurawada: విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలనతో పాటు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సూచించారు. హాస్టల్‌లోని ఓ విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, విద్యా సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టడీ అవర్‌లో విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాలు, ఆసక్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. మీరు కూడా నా లాగా కలెక్టర్ స్థాయికి ఎదగాలి. భవిష్యత్తులో మీలాంటి విద్యార్థులను ప్రోత్సహించే స్థాయికి చేరుకోవాలి అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.
విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ సత్యపద్మ, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, హాస్టల్ వార్డెన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.




