Visakhapatnam: విశాఖ జిల్లా రెడ్డిపల్లిలో అనధికార లేఅవుట్.. మూసుకుపోయిన దారి

Visakhapatnam: విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో అనధికార లేఅవుట్ వల్ల దారి మూసుకుపోయి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ అధికారుల సర్వేకు ఆదేశం.

SHIVA, BHIMILI
Published on: 29 Sept 2026 9:50 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ జిల్లా రెడ్డిపల్లిలో అనధికార లేఅవుట్.. మూసుకుపోయిన దారి

విశాఖపట్నం: విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామంలో లేఅవుట్ వ్యవహారం స్థానిక గ్రామస్తులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్ ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉండగా.. లేఅవుట్ చుట్టూ బౌండరీ నిర్మించి గేటుకు తాళాలు వేయడంతో వెనుక గ్రామాలకు రాకపోకలకు ఉపయోగపడుతున్న రహదారి మూసుకుపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెడ్డిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 45 పరిధిలో లేఅవుట్ ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లేఅవుట్‌కు వెనుక ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు గతంలో నుంచి అక్కడి రహదారిని రాకపోకలకు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల లేఅవుట్ చుట్టూ బౌండరీ నిర్మించి గేటు ఏర్పాటు చేసి తాళాలు వేయడంతో తమ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని గ్రామస్తులు చెబుతున్నారు.

రహదారి అందుబాటులో లేకపోవడంతో వెనుక గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ప్రజల రాకపోకలకు ఉపయోగపడుతున్న ఈ మార్గాన్ని పరిశీలించి, వాస్తవ పరిస్థితులను గుర్తించి రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించారు. డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 45లో సుమారు 3 ఎకరాల 50 సెంట్ల జిరాయితీ భూమి ఉన్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో అనధికారికంగా లేఅవుట్ ఏర్పాటు చేసినట్లు గుర్తించామని, లేఅవుట్‌కు ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు.

అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి, బంజరు భూమి లేదా ప్రజలు ఉపయోగించే రహదారి విషయంలో మరింత స్పష్టత కోసం సర్వే నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సర్వే అనంతరం వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.

ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న రహదారి విషయంలో సమగ్ర సర్వే నిర్వహించి.. తమ రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వెనుక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI