Madhurawada: అనుమతులు లేకుండా బాణాసంచా అమ్మితే చర్యలు

Madhurawada: విశాఖ మధురవాడలో అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని పీఎం పాలెం సీఐ గేదెల బాలకృష్ణ హెచ్చరిక. 45 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడి.

JAI RAM, MADURAWADA
Published on: 6 Nov 2026 6:05 PM IST
Madhurawada
X

Madhurawada: అనుమతులు లేకుండా బాణాసంచా అమ్మితే చర్యలు

మధురవాడ: బాణాసంచా విక్రయాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా విక్రయాలు నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ గేదెల బాలకృష్ణ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా స్టాళ్లు ఏర్పాటు చేసే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి (ఐపీఎస్) ఆదేశాల మేరకు, నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ ఎస్. అప్పలరాజు పర్యవేక్షణలో మధురవాడ పరిధిలో బాణాసంచా విక్రయాల కోసం స్టాళ్ల ఏర్పాటుపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీఐ బాలకృష్ణ మాట్లాడుతూ, బాణాసంచా విక్రయించాలనుకునే వ్యాపారులు పోలీస్, అగ్నిమాపక శాఖ, జీవీఎంసీ నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. ప్రతి స్టాల్ వద్ద అగ్నిప్రమాదాల నివారణకు నీరు, ఇసుక బకెట్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత పరిమితికి మించి బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మధురవాడ పరిధిలో బాణాసంచా స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 45 దరఖాస్తులు అందినట్లు సీఐ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి లైసెన్సులు జారీ చేయలేదని వెల్లడించారు. ప్రాంతాల వారీగా ఓజోన్ వ్యాలీ నుంచి 31, మిధులాపురి కాలనీ రోడ్డు నుంచి 4, లా కాలేజ్ రోడ్డు నుంచి 2, నగరంపాలెం రోడ్డు నుంచి 4, బక్కనపాలెం నుంచి 3 దరఖాస్తులు అందినట్లు వివరించారు.

ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని జనావాసాలకు, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే నిబంధనల ప్రకారం బాణాసంచా విక్రయాలకు అనుమతులు మంజూరు చేస్తామని సీఐ స్పష్టం చేశారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA