Visakhapatnam: విశాఖ ఆత్మగౌరవాన్ని ప్రజలే కాపాడుకోవాలి!

Visakhapatnam: విశాఖ ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యమని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ స్పష్టం చేశారు. GVMC వద్ద మాట్లాడిన ఆయన ప్రభుత్వం, సూపర్ సిక్స్ హామీలపై విమర్శలు గుప్పించారు.

GOPI, PENDURTHI
Published on: 19 Oct 2026 1:01 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ ఆత్మగౌరవాన్ని ప్రజలే కాపాడుకోవాలి!

Visakhapatnam: విశాఖపట్నం నగర భవిష్యత్తు, ప్రజల ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని సోమవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర, విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ పిలుపునిచ్చారు. అన్యాయాన్ని సహించేది లేదని, అక్రమాలను ప్రశ్నించడంలో వెనుకడుగు వేసేది లేదని, ప్రజల పక్షాన నిలబడి ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.

“ఎదురించే వాడు లేకపోతే.. బెదిరించేవాడిదే రాజ్యం!”

ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించకుండా, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు కేవలం హామీలు ఇవ్వడం కాకుండా, ఆ హామీలను ఆచరణలో పెట్టి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని అన్నారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి, వారి సంక్షేమం కోసం పనిచేయడమే నిజమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. “ఎదురించేవాడు లేకపోతే.. బెదిరించేవాడిదే రాజ్యం!” అనే నినాదంతో ప్రజల పక్షాన నిలబడి, అన్యాయంపై ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగిస్తానని బి.వి.రామ్ స్పష్టం చేశారు.

విశాఖపట్నం కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. నగర భవిష్యత్తును రాజకీయ స్వార్థాలకు బలిచేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ప్రజలు మౌనం వీడి, తమ ఓటు విలువను గుర్తించి, నగర అభివృద్ధి మరియు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో, విశాఖపట్నంలో జరుగుతున్నాయని తాను ఆరోపిస్తున్న అన్యాయాలు, అక్రమాలపై అధికార పార్టీ సమాధానం చెప్పాలని అధినేత బి.వి.రామ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అని, తప్పులను ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

“ప్రశ్నించే గొంతును అణచివేయడం ద్వారా ప్రజల ఆకాంక్షలను అడ్డుకోలేరు"

2025లో గాజువాకలో తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, ఈ ఘటనపై బాధ్యులు సమాధానం చెప్పాలని, ప్రజాప్రతినిధులు ప్రజల భద్రతకు మరియు ప్రజాస్వామ్య హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. “ప్రశ్నించే గొంతును అణచివేయడం ద్వారా ప్రజల ఆకాంక్షలను అడ్డుకోలేరు. అన్యాయాన్ని ఎదిరించడం నా బాధ్యత, ప్రజల పక్షాన నిలబడటం నా కర్తవ్యం” అని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పై స్పష్టత ఇవ్వాలని బి.వి.రామ్ డిమాండ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, నిరుద్యోగ యువతకు భృతి, మైనారిటీలకు పదవులు వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని బి.వి.రామ్ డిమాండ్ చేశారు. తనపై జరిగిన దాడి విషయంలోనూ స్పందించాలని కోరుతూ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు.

“అధికారం శాశ్వతం కాదు – ప్రజల తీర్పే అంతిమం. పదవులు తాత్కాలికం – ప్రజల విశ్వాసమే అసలైన బలం” అని పేర్కొంటూ, విశాఖపట్నం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచనాత్మకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నం అభివృద్ధి, ప్రజల హక్కులు, నగర ఆత్మగౌరవం కోసం తెలుగు శక్తి తన రాజకీయ వైఖరిని, భవిష్యత్తులో ఎవరికీ మద్దతు ఇస్తుందనే నిర్ణయాన్ని తగిన సమయంలో ప్రకటిస్తుందని తెలిపారు.

విశాఖ ప్రజల గౌరవం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నా పోరాటం

“భయంతో వెనక్కి తగ్గేది లేదు, ప్రలోభాలకు తలవంచేది లేదు, ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదు. విశాఖ ప్రజల గౌరవం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నా పోరాటం నిరంతరం కొనసాగుతుందని బి.వి.రామ్ స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజలు ఐక్యంగా ముందుకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

విశాఖపట్నం రాజకీయాల్లో ప్రస్తుతం మేయర్‌ కేంద్రంగా సాగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. అధికార అహంభావానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఈ పరిణామాలను పలువురు అభివర్ణిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజాప్రయోజనాలే ప్రాధాన్యంగా ఉండాలని, ప్రజల గొంతుకగా నిలిచే నాయకత్వం అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఎదుటివారు ఎంతటి వారైనా సరే.. తప్పు జరిగితే ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం, అక్రమాలకు తలొగ్గకుండా ప్రజల పక్షాన నిలబడటమే నిజమైన నాయకత్వ లక్షణాలని ఈ పరిణామాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో డాక్టర్ పపూర్ నికుంజ్, మానవ హక్కుల కౌన్సిల్ కార్యదర్శి ఎం.శ్యాంప్రసాద్, ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI