Visakhapatnam: హైకోర్టు తీర్పు రాకుండానే ఋషికొండపై నిర్ణయమా?: మూర్తి యాదవ్!
Visakhapatnam: విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ విషయంలో హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఆతిథ్య రంగానికి లీజుకు ఇచ్చే నిర్ణయాలు తీసుకోరాదని పిటిషనర్ పీతల మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.
Visakhapatnam: హైకోర్టు తీర్పు రాకుండానే ఋషికొండపై నిర్ణయమా?: మూర్తి యాదవ్!
విశాఖపట్నం, నవంబర్ 28: పర్యావరణపరంగా సున్నితమైన, వివాదాస్పద ఋషికొండపై గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 452కోట్ల ప్రజాధనం తో నిర్మించిన ప్యాలెస్ విషయంలో హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని దీనిపై హైకోర్టులో ఐదేళ్లుగా పోరాటం చేస్తున్న మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. ఈ విషయమై పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, ఋషికొండ ప్యాలెస్ నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని హైకోర్టు నియమించిన నిపుణుల కమిటీ స్పష్టం చేస్తూ బుధవారం నివేదికను కోర్టు కు అందజేసిందని గుర్తు చేశారు.
ఆ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా రుషికొండ ప్యాలెస్ ను ఆతిధ్య రంగానికి లీజ్ కి ఇస్తామని, టిక్కెట్ పెట్టి ప్రజలకు చూపిస్తామని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం నూటికి నూరు శాతం కోర్టు ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు.
నివేదిక గురించి మంత్రివర్గానికి తెలియదేమో ?
హైకోర్టుకు పర్యావరణ నిపుణులు కమిటీ రుషికొండ ప్యాలెస్ విషయంలో ఇచ్చిన నివేదిక గురించి అధికారులు మంత్రివర్గానికి తెలియజేయకుండా తప్పుదారి పట్టించారని ఆయన ఆరోపించారు. ఆ నివేదిక గురించి తెలిస్తే మంత్రివర్గం ఇటువంటి నిర్ణయాలు తీసుకునేది కాదేమో అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నివేదికను పరిశీలించి ఆ నివేదిక ఆధారంగా హైకోర్టు తీసుకునే నిర్ణయం మేరకు ఋషికొండ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఋషికొండ ప్యాలెస్ ను లీజ్ ఇచ్చేందుకు కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లపై కూడా హైకోర్టు ద్రుష్టికి తీసుకువెళ్లామని దాని విషయమై రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది టెండర్ ఖరారు పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని హైకోర్టు కు తెలియజేశారు. ఈ కేసు విచారణ లో ఉండగా ప్రభుత్వం ఋషికొండ లీజు టెండర్ ను ఖరారు చెయ్యమని కోర్టు కి నీవేదించినప్పటికి ఇప్పుడు లీజుకి ఇవ్వాలని నిన్న కేబినెట్ లో నిర్ణయించడం కచ్చితంగా చట్ట ఊళ్ళంగనే అవుతుందని స్పష్టం చేశారు.
సి.ఆర్.జెడ్ లో చర్యలు తీవ్రం
సి.ఆర్.జెడ్ నిబంధనల ఉల్లంఘనల విషయంలో దిద్దుబాటు చర్యలు ఉండవని, భవనాల కూల్చివేతలే ఉంటాయని ఆయన చెప్పారు. కేరళలోని కొచ్చి సమీపంలోని మారాడు ఫ్లాట్ల విషయంలో ఇదే తరహాలో సిఆర్‌జెడ్ ఉల్లంఘన కేసులో, సిఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలను కూల్చివేయాలని గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. నోయిడా ట్విన్ టవర్ లను 2022 ఆగస్టు 28న భారత సుప్రీంకోర్టు నిర్ణయంతో కూల్చివేయాల్సి వచ్చిందని, ముంబై ఆదర్శ్ భవన సముదాయాల విషయంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశారు. ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ సొసైటీ ఎత్తైన భవనం నిర్మించబడింది.సొసైటీ భారతీయ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలను కూడా ఉల్లంఘించిందని, ఇది అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామాకు దారితీసిందని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే సంబంధిత అధికారులతో పాటు మంత్రివర్గం కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
అధికారులు ని,మంత్రులు ని ప్రొసీక్యూట్ చెయ్యాలి
పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం బాధ్యులైన ప్రతి ఒక్కరిపై, వారు అధికారులు అయినా, రాజకీయ నాయకులు అయినా, చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ చేపడతారు.ఇప్పటికే భీమిలి సి.ఆర్.జెడ్ ఉల్లంఘనల కేసులో ఇటువంటి ఒక ప్రాసిక్యూషన్ ప్రారంభించబడింది.ఈ అంశంపై గౌరవనీయమైన ధర్మాసనం (డివిజన్ బెంచ్) ముందు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి, తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తాను అని మూర్తి యాదవ్ పేర్కొన్నారు.*
హైకోర్టు పరిశీలనలో...
గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి వారి ఆదేశాల మేరకు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ, ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ సమర్పించిన వివరణలు, సంయుక్త కమిటీ నివేదికలు, వర్తించే చట్టబద్ధ నిబంధనలు, ఉపగ్రహ చిత్రాలు మరియు క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో నమోదు చేసిన పరిశీలనలతో సహా అందుబాటులో ఉన్న అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించింది.
నిబంధనల కమిటీ అభిప్రాయాలు ఇవే
సమగ్ర పరిశీలన అనంతరం, ఈ ప్రాజెక్టు అమలు కారణంగా విస్తృత స్థాయిలో తవ్వకాలు, కొండల కోత, భూమిని చదును చేయడం మరియు భారీ పరిమాణంలో తవ్వకాల ద్వారా వెలువడిన మట్టి, వ్యర్థ పదార్థాలు (మక్), నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలు ఉత్పత్తి కావడం ద్వారా సహజ కొండ భౌగోళిక స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని కమిటీ నిర్ధారించింది. ఈ పదార్థాలలో గణనీయమైన పరిమాణాన్ని తీర నియంత్రణ మండలి (Coastal Regulation Zone – CRZ) పరిధిలోకి వచ్చే ప్రాంతాలతో సహా పలు ప్రదేశాల్లో పారవేయడం వల్ల తీరప్రాంత భౌగోళిక స్వరూపం మరియు ఆ ప్రాంత పర్యావరణ లక్షణాలు ప్రభావితమయ్యాయి.
సహజ భూ స్వరూపంలో మార్పులు
అంతేకాకుండా, ఈ కార్యకలాపాల కారణంగా భూమి వనరుల క్షీణత, సహజ భూభాగ స్వరూపంలో మార్పులు, పర్యావరణ వ్యవస్థ విధుల నష్టం, తీరప్రాంత సహజ సౌందర్యం మరియు వినోద విలువలు దెబ్బతినడం, అలాగే భవిష్యత్తులో భూ వినియోగానికి సంబంధించిన అవకాశాలు కోల్పోవడం వంటి కొలవదగిన పర్యావరణ ప్రభావాలు సంభవించాయని కమిటీ గుర్తించింది. ఈ కార్యకలాపాల వల్ల ఏర్పడిన పర్యావరణ ప్రభావాలు ప్రాజెక్టు పరిధిలోని తక్షణ ప్రాంతానికే పరిమితం కాకుండా దాని వెలుపలి ప్రాంతాలకూ విస్తరించాయి. అందువల్ల శాస్త్రీయ సూత్రాల ఆధారంగా క్రమబద్ధమైన పర్యావరణ పునరుద్ధరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
పర్యావరణ నష్టాన్ని భర్తీ చేయాలి
గుర్తించిన పర్యావరణ క్షీణతకు సంబంధించి సంభవించిన నష్టాన్ని కమిటీ అంచనా వేసింది. ఈ అంచనాలో భూమి, సహజ భూభాగ స్వరూపం, ప్రభావితమైన CRZ ప్రాంతాలు, పర్యావరణ వ్యవస్థ విధులు, అలాగే తీరప్రాంత సహజ సౌందర్యం మరియు వినోద ప్రదేశాలపై గణనీయమైన ప్రభావాలు ఉన్నట్లు గుర్తించబడింది. వీటితో పాటు తదుపరి శాస్త్రీయ పరిశోధన అవసరమయ్యే ఇతర పర్యవసాన ప్రభావాలు కూడా ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది.
దిద్దుబాటు చర్యలకు సిఫార్సు
ప్రభావితమైన పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించేందుకు శాస్త్రీయంగా రూపొందించిన పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళిక (Environmental Restoration Plan) అమలు చేయాలని కమిటీ తన పరిశీలనాత్మక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తీరప్రాంత పర్యావరణ శాస్త్రం, భూ స్వరూప శాస్త్రం (Geomorphology), భూసాంకేతిక ఇంజినీరింగ్ (Geotechnical Engineering), జీవవైవిధ్య పరిరక్షణ మరియు పర్యావరణ పునరుద్ధరణ రంగాల్లో నైపుణ్యం కలిగిన సమర్థ నిపుణ సంస్థల ద్వారా ఈ ప్రణాళికను రూపొందించాలి. ప్రభావిత ప్రాంతాల స్థిరమైన పునరావాసం మరియు పునరుద్ధరణను నిర్ధారించేందుకు ఈ ప్రణాళికలో పునరుద్ధరణ లక్ష్యాలు, అమలు వ్యూహాలు, పర్యవేక్షణ విధానాలు మరియు కొలవదగిన పర్యావరణ ఫలితాలను స్పష్టంగా నిర్దేశించాలి.
పునరుద్ధరణ చర్యల అమలును సంబంధిత సమర్థ నియంత్రణ సంస్థల (Competent Regulatory Authorities) పర్యవేక్షణలో చేపట్టాలని కమిటీ మరింతగా సిఫార్సు చేసింది. సంబంధిత శాస్త్రీయ మరియు నియంత్రణ సంస్థల ప్రతినిధులతో కూడిన బహుళ విభాగాల యంత్రాంగం ద్వారా ఈ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
పునరుద్ధరణ చర్యల ప్రభావాన్ని అంచనా వేయడానికి మరియు అవసరమైన సందర్భాల్లో తగిన మార్పులు, సర్దుబాట్లు చేసేందుకు కొండ వాలుల స్థిరత్వం, తీరప్రాంత భూ స్వరూప మార్పులు, సముద్ర తీరరేఖలో మార్పులు, జీవవైవిధ్యం, వృక్షసంపద పునరుద్ధరణ మరియు ఇతర పర్యావరణ ప్రమాణాలపై దీర్ఘకాలిక పర్యవేక్షణ చేపట్టాలి. ఈ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తరువాత, హైకోర్టు తుది తీర్పుకు లోబడే ఋషికొండ విషయంలో నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ పీతల మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.




