Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించిన ఎంపీ!
Visakhapatnam: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రూ.660 కోట్లతో చేపడుతున్న మేజర్ అప్‌గ్రేడేషన్ పనులను ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ గురువారం రైల్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించిన ఎంపీ!
విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించి, దేశంలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్లలో ఒకటిగా అభివృద్ధి చేస్తామని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. ప్రయాణికుల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సుమారు రూ.660 కోట్లతో చేపడుతున్న స్టేషన్ మేజర్ అప్‌గ్రేడేషన్ పనులను గురువారం ఆయన రైల్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రైల్వే చీఫ్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్) విష్ణుమూర్తి, డి.ఆర్.యు.సి.సి సభ్యులు చలసాని గాంధీ,టిడిపి దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ సీతం రాజుసుధాకర్ స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి వివిధ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
*రూ.660 కోట్లతో విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు*
ప్రారంభంలో రూ.480 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రయాణికుల రద్దీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత విస్తరించినట్లు ఎంపీ తెలిపారు. ఇందులో భాగంగా ప్లాట్‌ఫారాల సంఖ్యను ప్రస్తుతమున్న 8 నుంచి 14కు పెంచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని, దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.660 కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ విస్తరణతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ దేశంలోని అత్యధిక ప్లాట్‌ఫారాలు కలిగిన ఐదు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలవనుందని పేర్కొన్నారు.
*రైళ్ల సమయపాలనకు ప్రత్యేక చర్యలు*
విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకునే రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించేందుకు గోపాలపట్నం నుంచి విశాఖపట్నం వరకు ప్రస్తుతం ఉన్న రెండు రైల్వే లైన్లను నాలుగు లైన్లుగా విస్తరించే క్వాడ్రుప్లింగ్ పనులు చేపడుతున్నట్లు శ్రీభరత్ వివరించారు. దువ్వాడ, గోపాలపట్నం మార్గాల్లో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడం ద్వారా ప్రస్తుతం 73-74 శాతంగా ఉన్న రైళ్ల సమయపాలనను 95-96 శాతానికి మెరుగుపరచే అవకాశం ఉంటుందని తెలిపారు. సింహాచలం మీదుగా చేపడుతున్న బైపాస్ రైల్వే లైన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
*విమానాశ్రయ తరహాలో ఆధునిక ప్రయాణికుల వసతులు*
స్టేషన్‌కు ఇరువైపులా నిర్మిస్తున్న నూతన భవనాలను అనుసంధానిస్తూ 72 మీటర్ల వెడల్పుతో భారీ ఎయిర్ కాంకోర్స్‌ను నిర్మిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. విమానాశ్రయ టెర్మినల్ తరహాలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంగణంలో ఒకేసారి సుమారు 4,000 మంది ప్రయాణికులు వేచి ఉండే సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపులు, ప్రత్యేక ఏసీ లాంజ్‌లతో పాటు ప్రయాణికులకు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
*పార్కింగ్, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం*
స్టేషన్ పరిసరాల్లో సుమారు 450 కార్లు, 2,000 ద్విచక్ర వాహనాలు నిలిపేలా పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్యాబ్ అగ్రిగేటర్లకు కూడా ప్రత్యేక స్థలాలను కేటాయించనున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేషన్ పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, సుమారు 60 ఎకరాల స్టేషన్ ప్రాంగణంలో వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా నీటి పునర్వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.
*నిర్దేశిత గడువులో పనుల పూర్తి*
స్టేషన్ ఆధునికీకరణ పనులను దశలవారీగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. మొదటి దశ పనులను 2027 డిసెంబర్ నాటికి, మొత్తం ప్రాజెక్టును 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించిందని చెప్పారు.
విశాఖపట్నం నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైల్వే మౌలిక సదుపాయాలను కూడా అదే స్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి ఆధునిక రైల్వే సదుపాయాలు ఎంతో కీలకమని, ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నగర అభివృద్ధిలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు.




