Visakhapatnam: మాజీ గవర్నర్ కంభంపాటితో కూటమి మేయర్ అభ్యర్థి భేటీ!
Visakhapatnam: విశాఖ కూటమి మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి, ఎంపీ శ్రీభరత్ ఒడిశా మాజీ గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిసి ఆశీస్సులు తీసుకుని నగర అభివృద్ధిపై చర్చించారు.
Visakhapatnam: మాజీ గవర్నర్ కంభంపాటితో కూటమి మేయర్ అభ్యర్థి భేటీ!
విశాఖపట్నం: అక్టోబర్29 కూటమి మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు గురువారం దసపల్లా హిల్స్‌లోని ఒడిశా రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ ముక్కా శ్రావణి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
శ్రావణి రాజకీయ పరిణతి, కుటుంబ నేపథ్యం గురించి డాక్టర్ హరిబాబు వివరాలు తెలుసుకున్నారు. విశాఖపట్నం భవిష్యత్తు అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ, నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమలు చేయాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ముక్కా శ్రావణి తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రధాన అంశాలను ఆయనకు వివరించారు.
ప్రశాంత విశాఖ భవిష్యత్తును కాపాడుతూ, నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి కూటమికి ఉందని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు.* నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలన్నదే కూటమి లక్ష్యమని పేర్కొన్నారు.
మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నగర పాలనలో నాయకత్వ బాధ్యత, ప్రజలకు జవాబుదారీతనం వంటి అంశాలపై ఎంపీ శ్రీభరత్, మాజీ గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ముక్కా శ్రావణి మాట్లాడుతూ, నగర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజాసేవలో పెద్దల మార్గదర్శకత్వం, ఆశీస్సులు తనకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. విశాఖపట్నం సమగ్ర అభివృద్ధి కోసం పెద్దలందరి మద్దతు, సహకారం ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
విశాఖపట్నాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అనుభవజ్ఞులైన నాయకుల సూచనలు, మార్గదర్శకత్వంతో ముందుకు సాగాలనే సంకల్పాన్ని ఈ భేటీ సందర్భంగా కూటమి నేతలు వ్యక్తం చేశారు.




