Visakhapatnam: మేఘాద్రి గెడ్డ జలాశయంలో ఘనంగా శుభ్రత కార్యక్రమం!

Visakhapatnam: మేఘాద్రి గెడ్డ జలాశయంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. జలాశయాలను కాపాడుకోవడం మన బాధ్యతని రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు పిలుపునిచ్చారు.

SHIVA, BHIMILI
Published on: 17 Oct 2026 12:49 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: మేఘాద్రి గెడ్డ జలాశయంలో ఘనంగా శుభ్రత కార్యక్రమం!

Visakhapatnam: మనకు జీవనాధారమైన జలవనరులను పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు పిలుపునిచ్చారు. జలాశయాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు, చెత్తాచెదారం వేయడం వల్ల తాగునీరు కలుషితమవడంతోపాటు, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలోని మేఘాద్రి గెడ్డ జలాశయం (డ్యామ్) లోపల, చుట్టుపక్కల పరిసరాల్లో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు సింహాద్రి టీఎంటీ, హిమ హ్యుమానిటేరియన్ అసోసియేషన్, స్థానిక యువత ఆధ్వర్యంలో జలాశయ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు మాట్లాడుతూ, నీరు లేనిదే జీవం లేదనే ఉన్నత ఆశయంతో మన పూర్వీకులు నదులను, జలాశయాలను పవిత్రమైన క్షేత్రాలుగా భావించి గౌరవించేవారని గుర్తుచేశారు.

“నీరు లేనిదే జీవం లేదు. మనకు జీవనాధారమైన తాగునీటిని అందించే జలాశయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. వాటిని ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు, చెత్తాచెదారంతో కలుషితం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలుగుతుంది” అని పి.ఎస్. నాయుడు పేర్కొన్నారు.

ప్రస్తుతం జలవనరుల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు, ఇతర చెత్తాచెదారం కారణంగా తాగునీరు కలుషితమై ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. నీటిలో నివసించే జీవులు కూడా కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జలాశయాలను పరిశుభ్రంగా ఉంచడం, వాటిలో వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరమని అన్నారు.

జలవనరుల పరిరక్షణను ప్రభుత్వాలకే పరిమితం చేయకుండా, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలు, యువత, స్థానిక ప్రజలు కలిసి పనిచేస్తే జలాశయాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, భవిష్యత్ తరాలకు సురక్షితమైన నీటి వనరులను అందించవచ్చని పేర్కొన్నారు.

జలాశయంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త తొలగింపు

ఈ సందర్భంగా హిమ హ్యుమానిటేరియన్ అసోసియేషన్, సింహాద్రి టీఎంటీ సభ్యులు, స్థానిక యువత, స్వచ్ఛంద సేవకులు మేఘాద్రి గెడ్డ జలాశయంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు, చెత్తను బయటకు తీసి జలాశయం లోపల, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువతను ఈ సందర్భంగా అభినందించారు.

జలాశయ పరిశుభ్రతను ఒక్కరోజు కార్యక్రమానికే పరిమితం చేయకుండా, ప్రతి నెలా ఒకసారి మేఘాద్రి గెడ్డ జలాశయాన్ని శుభ్రపరిచేందుకు తమ సంస్థ సభ్యులు కృషి చేస్తారని హిమ హ్యుమానిటేరియన్ అసోసియేషన్, సింహాద్రి టీఎంటీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులోనూ పర్యావరణ పరిరక్షణ, జలవనరుల పరిశుభ్రతకు సంబంధించి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.

ప్రముఖులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యం

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా రిటైర్డ్ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పైలా సన్నీ బాబు, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ సభ్యులు భరణి కాన రామారావు, టి.వి.డి. దాస్, ఫరూక్ ఆర్.వి.కె. నాయుడు పాల్గొన్నారు.

డాబాగార్డెన్స్ ఆదిత్య డిగ్రీ కాలేజీ ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు, స్థానిక యువత, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జలాశయ శుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇట్లు,

హిమ హ్యుమానిటేరియన్ అసోసియేషన్

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI