Gajuwaka: నిజాయితీ చాటుకున్న బైక్ సీట్ కవర్ల కార్మికుడు వీరభద్రరావు!

Gajuwaka: విశాఖ గాజువాకలో బైక్ సీట్ కవర్లు కుట్టే కార్మికుడు గోరు వీరభద్రరావు తనకు దొరికిన రూ.1,55,900 నగదు, పత్రాలను పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నారు.

PRAKASH, GAJUWAKA
Published on: 13 Nov 2026 4:40 PM IST
Gajuwaka
X

Gajuwaka: నిజాయితీ చాటుకున్న బైక్ సీట్ కవర్ల కార్మికుడు వీరభద్రరావు!

గాజువాక: నిజాయితీ, నైతిక విలువలు సమాజంలో ఇంకా సజీవంగా ఉన్నాయని నిరూపిస్తూ, తనకు దొరికిన రూ.1,55,900 నగదుతో పాటు విలువైన పత్రాలను ఎటువంటి స్వార్థం లేకుండా పోలీసులకు అప్పగించి గోరు వీరభద్రరావు అనే వ్యక్తి ఆదర్శంగా నిలిచారు.

వివరాల్లోకి వెళితే, గాజువాకలోని కనితి రోడ్డులో నివాసం ఉంటూ బైక్ సీట్ కవర్లు కుట్టే వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గోరు వీరభద్రరావు, తండ్రి సూర్యనారాయణ, వయస్సు సుమారు 50 సంవత్సరాలు, ఈరోజు (13.11.2026) ఉదయం కాలకృత్యాల నిమిత్తం వెళ్తుండగా CMR సెంటర్ ఎదురుగా ఒక బ్యాగు కనిపించింది.

ఆ బ్యాగును పరిశీలించగా అందులో రూ.1,55,900 నగదుతో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఎలాంటి స్వార్థానికి తావివ్వకుండా ఆ బ్యాగును గాజువాక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు.

వెంటనే స్పందించిన గాజువాక పోలీసులు బ్యాగులో లభించిన పత్రాల ఆధారంగా విచారణ చేపట్టి, ఆ బ్యాగు సాయికిషోర్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి చెందినదిగా గుర్తించారు. అనంతరం సాయికిషోర్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఆయన గుర్తింపు వివరాలు మరియు సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, బ్యాగు ఆయనదేనని నిర్ధారించిన తరువాత అందులోని పూర్తి నగదు రూ.1,55,900 మరియు విలువైన పత్రాలను ఆయనకు తిరిగి అప్పగించడం జరిగింది.

సాధారణ జీవనోపాధితో జీవనం సాగిస్తున్నప్పటికీ, తనకు దొరికిన విలువైన నగదుపై ఎలాంటి ఆశ చూపకుండా, నిజాయితీతో వ్యవహరించి పోలీసులకు అప్పగించిన గోరు వీరభద్రరావు ప్రవర్తన ఎంతో అభినందనీయం. ఆయన చూపిన నిజాయితీ, నైతిక విలువలు మరియు సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.

ఈ సందర్భంగా గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ వాసు నాయుడు గారు గోరు వీరభద్రరావు గారి నిజాయితీని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి నిజాయితీపరుల వల్ల సమాజంలో మానవత్వం, నమ్మకం మరియు నైతిక విలువలు మరింత బలపడతాయని తెలిపారు. నిజాయితీ అనేది ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేని గొప్ప వ్యక్తిత్వ లక్షణం. గోరు వీరభద్రరావు గారు తన చేతల ద్వారా ఈ విషయాన్ని నిరూపించారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA