Visakhapatnam: విశాఖలో శరన్నవరాత్రి వేడుకలు: లలితాంబగా చిన్నారి పూజ!
Visakhapatnam: మధురవాడలో దసరా వేడుకల్లో భాగంగా చిన్నారి పూజను శ్రీ లలితాంబగా అలంకరించి పూజించారు. మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు.
Visakhapatnam: విశాఖలో శరన్నవరాత్రి వేడుకలు: లలితాంబగా చిన్నారి పూజ!
Visakhapatnam: మధురవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిపారవశ్యంతో కొనసాగుతున్నాయి. మధురవాడ ధోబీ కాలనీలోని బంగారు అశోక్కుమార్–ఝాన్సీ దంపతుల స్వగృహంలో నిర్వహిస్తున్న నవరాత్రి వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. జగన్మాతను ప్రతిరోజూ వివిధ దేవీ స్వరూపాల్లో అలంకరిస్తూ సంప్రదాయబద్ధంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
గురువారం శ్రీ లలితా దేవి అవతారంలో అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ వేడుకల్లో చిన్నారి పూజను శ్రీ లలితాంబ స్వరూపంగా అలంకరించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నుదుట ఎర్రని కుంకుమ తిలకం.. శిరస్సున ధగధగలాడే కిరీటం.. ఒంటినిండా మెరిసే ఆభరణాలు.. ఎరుపు రంగు పట్టుచీరలో రాచఠీవి..!
ఆ చిట్టితల్లిని చూస్తుంటే సాక్షాత్తు శ్రీ లలితా పరమేశ్వరి బాలరూపంలో భువికి దిగివచ్చిందా అన్న అనుభూతి కలిగింది.ముగ్ధమనోహరమైన ముఖవర్చస్సు.. ప్రశాంతమైన కనులు.. దేవీ స్వరూపాన్ని తలపించే అపురూప అలంకరణతో చిన్నారి పూజ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పసిపాపలో పరాశక్తిని దర్శించుకున్న అనుభూతితో భక్తులు పరవశించిపోయారు.
ఇక ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక కుంకుమార్చనలు, మంగళహారతులు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, లలితాంబ నామస్మరణతో గృహ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.సాయంత్రం మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది.
పసుపు, కుంకుమలు, పండ్లు, పూలు, పట్టువస్త్రాలు, మంగళద్రవ్యాలతో మహిళలు సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. భక్తుల నామస్మరణలు, మంగళహారతులతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.లోకకల్యాణం, సర్వజన శ్రేయస్సు, కుటుంబాల సుఖశాంతుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు బంగారు అశోక్కుమార్–ఝాన్సీ దంపతులు ఆకాంక్షించారు. ఒకవైపు లలితాంబ దివ్యదర్శనం.. మరోవైపు చిట్టితల్లి పూజ అపురూప అలంకరణ.. మేళతాళాల నడుమ అమ్మవారికి సారె సమర్పణ..! ఇలా భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికత కలగలిసిన శరన్నవరాత్రి వేడుకలు మధురవాడలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




