Visakhapatnam: సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్

Visakhapatnam: విశాఖలో ఈ నెల 19న సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, ఇళ్ల పట్టాల పంపిణీకి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశం.

JAI RAM, MADURAWADA
Published on: 17 Sept 2026 6:53 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్

విశాఖపట్నం: ఈ నెల 19న ముఖ్యమంత్రి విశాఖపట్నం పర్యటన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, 26,426 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు బీచ్‌రోడ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో పట్టాల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. లబ్ధిదారులు ఆహ్వాన పత్రికతో వచ్చి సంబంధిత స్టాల్‌లో చూపించిన అనంతరం పట్టాలు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టాల పంపిణీ కోసం 10 గ్యాలరీలు, 100 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాలు, వార్డుల వారీగా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రతి వార్డుకు ఒక వీఆర్వోను ఇన్‌చార్జిగా నియమించి లబ్ధిదారుల వివరాలను పక్కాగా మ్యాపింగ్ చేయాలన్నారు. లబ్ధిదారులకు ఆహ్వాన పత్రిక అందించే సమయంలోనే పికప్ పాయింట్లు, వేదికకు చేరుకునే మార్గాలు తెలియజేయాలని, రవాణా, భోజన వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు మధ్యాహ్నం 1 గంటకే వేదిక వద్దకు చేరుకుని కేటాయించిన సీట్లలో కూర్చునేలా అవగాహన కల్పించాలన్నారు.

పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం చేసి అవసరమైన వసతులు కల్పించాలని, పార్కింగ్ ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని సూచించారు. ఈ నెల 18న రూట్‌మ్యాప్, పార్కింగ్ ఏర్పాట్లపై మాక్‌డ్రిల్ నిర్వహించి అన్ని శాఖల మధ్య సమన్వయం పెంచాలన్నారు. కలెక్టరేట్‌తో పాటు ప్రధాన వేదిక వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని, 18, 19 తేదీల్లో బీచ్‌రోడ్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA