Visakhapatnam: జీవీఎంసీ 7వ వార్డులో సినీ నటుడు తనీష్ జోరుగా ప్రచారం!

Visakhapatnam: విశాఖ జీవీఎంసీ 7వ వార్డు జనసేన అభ్యర్థి అర్జాల మహేశ్వరి తరఫున సినీ నటుడు తనీష్ ప్రచారం. రాజీవ్ గృహకల్ప కాలనీలో ఓట్లు అభ్యర్థించిన తనీష్.

JAI RAM, MADURAWADA
Published on: 28 Oct 2026 10:14 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: జీవీఎంసీ 7వ వార్డులో సినీ నటుడు తనీష్ జోరుగా ప్రచారం!

విశాఖపట్నం: జీవీఎంసీ 7వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి (అర్జాల) దేవర మహేశ్వరి ఎన్నికల ప్రచారానికి ప్రముఖ సినీ నటుడు తనీష్ హాజరై మద్దతు తెలిపారు. విశాఖపట్నంలోని మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జనసేన అభ్యర్థి అర్జాల మహేశ్వరిని గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు.

ఈ సందర్భంగా సినీ నటుడు తనీష్ మాట్లాడుతూ.. 7వ వార్డు నుంచి అర్జాల మహేశ్వరి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. దేవర శివ 2016 నుంచి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదవుతున్న వార్డుల్లో 7వ వార్డు ఒకటిగా నిలవడం పార్టీ కార్యకర్తల అంకితభావానికి నిదర్శనమని అన్నారు.

క్యాడర్‌ నుంచి నాయకత్వ స్థాయికి ఎదగడమే జనసేన లక్ష్యం అని తనీష్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించడమే పార్టీ ఆశయమని పేర్కొన్నారు. 7వ వార్డు నుంచి జనసేన పార్టీ పోటీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వార్డులో ప్రచారానికి ప్రజల నుంచి లభిస్తున్న స్పందన ఉత్సాహాన్ని కలిగిస్తోందని, ఈ ఆదరణ చూస్తుంటే అర్జాల మహేశ్వరి విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతోందని తనీష్ ధీమా వ్యక్తం చేశారు. 7వ వార్డు నుంచి జనసేన పోటీ చేసేందుకు అవకాశం కల్పించే క్రమంలో ముళ్లి లక్ష్మణ్ త్యాగం చేసి, ప్రస్తుతం అభ్యర్థి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

అదేవిధంగా జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణిని గెలిపించుకునే బాధ్యత ప్రతి జనసేన నాయకుడు, కార్యకర్తపై ఉందని తనీష్ అన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని అర్జాల మహేశ్వరికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA