Anakapalli: స్వచ్ఛ వారియర్స్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే కొణతాల

Anakapalli: అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్‌లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే కొణతాల స్వచ్ఛ వారియర్స్‌ను సత్కరించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 2 Oct 2026 3:55 PM IST
Anakapalli
X

Anakapalli: స్వచ్ఛ వారియర్స్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే కొణతాల

అనకాపల్లి: స్వచ్ఛత, పారిశుధ్యం కోసం నిరంతరం సేవలందిస్తున్న స్వచ్ఛ వారియర్స్ సేవలు అభినందనీయమని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు.

అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ నేతృత్వంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. స్వచ్ఛత కోసం సేవలందిస్తున్న 67 మంది స్వచ్ఛ వారియర్స్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశ సరిహద్దులను సైనికులు కాపాడుతున్నట్లే.. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం స్వచ్ఛ వారియర్స్ సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్–2047 లక్ష్యానికి అనుగుణంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్–స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పరిశుభ్రత, సేవాభావంతో ముందుకు సాగాలని కోరారు.

స్వచ్ఛత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు, స్వచ్ఛత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI