Araku: అరకు ఏజెన్సీలో సబ్ కలెక్టర్ విస్తృత పర్యటన!

Araku: అల్లూరి జిల్లా అరకు, డుంబ్రిగూడ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ కే. చిరంజీవి నాగ వెంకట సాహిత్ విస్తృత పర్యటన. తుఫాను సహాయక చర్యలు, కించుమండ వంతెన, చాపరాయి జలపాతం వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలన.

REHAMAN, ARAKU
Published on: 29 Oct 2026 8:34 AM IST
Araku
X

Araku: అరకు ఏజెన్సీలో సబ్ కలెక్టర్ విస్తృత పర్యటన!

Araku: అల్లూరి సీతారామరాజు జిల్లా సబ్ కలెక్టర్ శ్రీ కె. చిరంజీవి నాగ వెంకట సాహిత్ తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలకు అందుతున్న సహాయక చర్యలు, రహదారి అనుసంధాన సదుపాయాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

గడికించుమండ గ్రామంలోని షెల్టర్ హోమ్ సందర్శన

పర్యటనలో భాగంగా తొలుత గడికించుమండ గ్రామంలోని షెల్టర్ హోమ్‌ను సబ్ కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యలను సమీక్షించారు. ప్రజలకు ఆహారం, తాగునీరు, వసతి తదితర మౌలిక సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కించుమండ–కిత్తలంగి పంచాయతీ ప్రధాన రహదారిపై వంతెన పరిశీలన

అనంతరం డుంబ్రిగూడ మండలంలోని కించుమండ నుంచి కిత్తలంగి పంచాయతీకి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెనను సబ్ కలెక్టర్ పరిశీలించారు. తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో రహదారి అనుసంధానానికి కలిగే అంతరాయాలను సమీక్షించి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

చాపరాయి జలపాతం వద్ద దెబ్బతిన్న ప్రహరీ గోడ పరిశీలన

పర్యటనలో చివరగా చాపరాయి జలపాతాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్, అక్కడ దెబ్బతిన్న ప్రహరీ గోడను పరిశీలించారు. పర్యాటకులు, సందర్శకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు రహదారులు, వంతెనలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU