Golugonda: కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: ఎంపీ చింతకాయల విజయ్
Golugonda: రాష్ట్రాభివృద్ధి కూటమితోనే సాధ్యమని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. గొలుగొండ మండలం ఏ.ఎల్.పురంలో కూటమి భారీ ర్యాలీ నిర్వహించారు.
Golugonda: కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: ఎంపీ చింతకాయల విజయ్
గొలుగొండ (ఏ.ఎల్.పురం): రాష్ట్ర సమగ్రాభివృద్ధి కేవలం ఎన్డీఏ (టీడీపీ, జనసేన, బీజేపీ) కూటమితోనే సాధ్యమవుతుందని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఉద్ఘాటించారు. జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల లో భాగంగా గొలుగొండ మండలం ఏ.ఎల్.పురం గ్రామంలో కూటమి నాయకులు, జనసేన నాయకుడు సూర్యచంద్ర, జడ్పీటీసీ అభ్యర్థి గోరా చంద్రశేఖర్,ఎంపీటీసీ సెగ్మెంట్-1, 2,3అభ్యర్థులు పెద్దపూడి పాప, ఎర్రంశెట్టి వెంకట కనకలక్ష్మి, చిటికెల వేణు గోపాల్, కార్యకర్తలు, మహిళలు, భారీ సంఖ్యలో గ్రామ ప్రజలతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎంపీ విజయ్ మాట్లాడుతూ ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
2014 నుంచి 2019 వరకు అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి జరిగిందని ఎంపీ విజయ్ స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ.ఎల్.పురం గ్రామ అభివృద్ధి కోసమే సుమారు రూ. 30 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చిన ఘనత అయ్యన్నపాత్రుడికే దక్కుతుందని ఆయన గుర్తుచేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కేవలం రెండున్నరేళ్ల కాలంలో నర్సీపట్నంలో రూ. 267 కోట్ల భారీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.
వైఎస్సార్సీపీ పాలన లో రాష్ట్రాన్ని పాలించే సత్తా, దమ్ము లేక నిధులు లేక వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే కక్ష సాధింపులో భాగంగా అయ్యన్నపాత్రుడిని అర్ధరాత్రి 3:30 గంటలకు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధి చేయడం చేతగాక దొంగ ఓట్లతో, డబ్బులు, మద్యం పంచి ఎన్నికల్లో గెలవాలని వైఎస్సార్సీపీ నాయకులు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని విజయ్ భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకురావడంతో పాటు, నర్సీపట్నానికి నీళ్లు అందించేందుకు చోడవరం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. అలాగే నర్సీపట్నానికి రూ. 500 కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టును మంజూరు చేయించిన ఘనత కూటమిదేనని స్పష్టం చేశారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో పౌరులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, రాష్ట్రాభివృద్ధి కోసం నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జడ్పీటీసీ అభ్యర్థి గోరా చంద్రశేఖర్, ఏ.ఎల్.పురం ఎంపీటీసీ సెగ్మెంట్-1 అభ్యర్థిగా పెద్దపూడి పాప, సెగ్మెంట్-2 అభ్యర్థిగా ఎర్రంశెట్టి వెంకట కనకలక్ష్మి, సెగ్మెంట్-3 అభ్యర్థిగా చిటికెల వేణు గోపాల్ పోటీ చేస్తున్నారని, వీరందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ విజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు అడిగర్ల నాని బాబు, సాంబమూర్తి, కూటమి శ్రేణులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.




