Makavarapalem: రైతు హక్కులకు భద్రత.. రాజముద్రతో పాస్ పుస్తకాలు: అయ్యన్నపాత్రుడు
Makavarapalem: మాకవరపాలెం లచ్చన్నపాలెంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.
Makavarapalem: రైతు హక్కులకు భద్రత.. రాజముద్రతో పాస్ పుస్తకాలు: అయ్యన్నపాత్రుడు
మాకవరపాలెం: మాకవరపాలెం మండలం, లచ్చన్నపాలెం గ్రామంలో శుక్రవారం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు వారి పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గతంలో భూములకు సరైన రికార్డులు లేకపోవడం వల్ల రైతుల ప్రమేయం లేకుండానే ఇతరులు బ్యాంకుల నుంచి రుణాలు పొందే పరిస్థితులు ఉండేవని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల బొమ్మలు వేయడం వల్ల బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి రాజకీయ బొమ్మలు లేకుండా, కేవలం ప్రభుత్వ రాజముద్రతో పాటు భూమి స్పష్టమైన సరిహద్దులు, కొలతలు, మ్యాప్‌లతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. దీనివల్ల భవిష్యత్తు తరాలకు కూడా భూ వివాదాలు లేకుండా భద్రత చేకూరుతుందని స్పష్టం చేశారు.
లచ్చన్నపాలెం గ్రామంతో కూడిన పైడిపాల రెవెన్యూ పరిధిలో మొత్తం 1,783 ఖాతాలు ఉండగా, ఇప్పటివరకు 1,615 పాస్ పుస్తకాలను సిద్ధం చేసి రైతులకు అందజేశామని స్పీకర్ వివరించారు. మిగిలిన 148 పెండింగ్ పుస్తకాలను కూడా త్వరలోనే పూర్తి చేసి అందజేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో కష్టపడి భూ రికార్డులను పక్కాగా సిద్ధం చేసిన ఆర్డీవో, తహశీల్దార్, రెవెన్యూ బృందాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
మండల అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, గత రెండు సంవత్సరాలలో మాకవరపాలెం మండలానికి ₹114 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేశామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇటీవల మండలంలోని 30 పంచాయతీల పరిధిలో 76 రకాల అభివృద్ధి పనుల కోసం ₹10.10 కోట్లు కేటాయించామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ₹11,085 కోట్లు మంజూరు చేయగా, అందులో నర్సీపట్నం నియోజకవర్గానికి 421 పనుల కోసం ₹43 కోట్ల నిధులు వచ్చాయని వివరించారు.
గ్రామాల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే ఊరుకునేది లేదని, స్థానిక నాయకులు, గ్రామీణ పెద్దలు దగ్గరుండి పనుల నాణ్యతను పరిశీలించాలని సూచించారు. వచ్చే ఏడాది నిధులను రోడ్లతో పాటు గ్రామాల్లో డ్రైనేజీ (కాలువల) నిర్మాణానికి కేటాయిస్తామని తెలిపారు.
అలాగే, తామరారం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు రోడ్డు మధ్యలో ప్రమాదాలు నివారించేందుకు, రాత్రి వేళల్లో వెలుగులు నింపేందుకు రూ. 35 లక్షల సిఎస్ఆర్ (CSR) నిధులతో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ, మండల తహశీల్దార్, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ సూర్యచంద్ర, మండల టీడీపీ అధ్యక్షుడు ఆర్.వై. పాత్రుడు, పోతల రాంబాబు, అల్లు నాయుడులతో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




