Anakapalli: కూటమిలో కుమ్ములాటలు.. గెలుపు జోరుకు గండం పడుతోందా!

Anakapalli: అనకాపల్లి జిల్లా తొలి విడత ఎన్నికల్లో 131 స్థానాలు గెలిచినా, సీట్ల సర్దుబాటు విభేదాలు, రెబల్స్ పోటీ కూటమి నేతలకు కొత్త తలనొప్పిగా మారాయి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 28 Nov 2026 4:20 PM IST
Anakapalli
X

Anakapalli: కూటమిలో కుమ్ములాటలు.. గెలుపు జోరుకు గండం పడుతోందా!

Anakapalli: అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి.తొలి విడత ఎన్నికల్లో కూటమి 131 స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ.. సీట్ల కేటాయింపులో తలెత్తిన విభేదాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక పార్టీకి కేటాయించిన స్థానంలో మరో పార్టీ అభ్యర్థి పోటీ చేయడం.. చివరి నిమిషం వరకు సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం కూటమి నేతలకు తలనొప్పిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అనకాపల్లి జిల్లాలో తొలి విడత ఎన్నికల లెక్కలు ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తం 215 స్థానాలకు గాను 32 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 183 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 131 స్థానాలను గెలుచుకోగా.. వైసీపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు మరో 6 స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఈ ఫలితాలతో కూటమి ఆధిపత్యం స్పష్టమైనప్పటికీ.. అంతర్గత సమన్వయంపై మాత్రం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీట్ల కేటాయింపు వ్యవహారం కూటమి పార్టీల మధ్య విభేదాలకు కారణమైందన్న చర్చ సాగుతోంది.సీట్ల సర్దుబాటులో అసంతృప్తి.. రెబల్స్‌ రూపంలో నిరసన!ఆశించిన స్థానాలు దక్కకపోవడంతో కొందరు నాయకులు రెబల్స్‌గా బరిలోకి దిగడం కూటమి అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అంశంగా మారింది. ఒకే కూటమికి చెందిన అభ్యర్థులు పరస్పరం పోటీ పడితే.. ఓట్ల చీలిక తప్పదన్న ఆందోళన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కూటమి పార్టీల మధ్య సమన్వయం బలంగా ఉంటేనే ఎన్నికల్లో విజయాల పరంపర కొనసాగుతుందని.. పరస్పర పోటీకి దిగితే గెలుపు స్ట్రైక్ రేట్ తగ్గే ప్రమాదం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. చివరి వరకు సీట్ల కేటాయింపుపై స్పష్టత రాకపోవడం, అసంతృప్తులకు సరైన పరిష్కారం చూపకపోవడం పార్టీ నాయకత్వాలకు సవాలుగా మారింది. రెబల్స్‌ వ్యవహారంపై అధిష్టానాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మరి.. కూటమి పార్టీల మధ్య విభేదాలకు అధిష్టానాలు ఫుల్‌స్టాప్‌ పెడతాయా? రెబల్స్‌ను బుజ్జగించి సమన్వయాన్ని పునరుద్ధరిస్తాయా? లేక ఈ అంతర్గత పోరు భవిష్యత్తులో కూటమి విజయాలపై ప్రభావం చూపుతుందా?అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI