Visakhapatnam: ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచాలి జెవి రత్నం!

Visakhapatnam: విశాఖలో వాయుగుండం వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాల పెంపుపై గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపు. ఇంకుడు గుంతల ఏర్పాటుకు విజ్ఞప్తి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Sept 2026 1:04 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచాలి జెవి రత్నం!

Visakhapatnam: ప్రతి నీటి చుక్కనీ ఒడిసి పట్టండి భూగర్భ జలాలు పెంపొందించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఎంపీపీ కాలనీలో కలిసిన విలేకరులతో మాట్లాడారు. "పారే నీటిని నిలబెట్టండి, నిలబడిన నీటిని భూగర్భం లోనికి ఇంకించండి" అనే ప్రభుత్వ నినాదాన్ని ఇప్పుడు అమలు చేయాలి అని కోరారు.

రెండు రోజుల కిందటి వరకు వర్షాలు లేక బాధపడిన మనం, ఈ రోజు వాయుగుండం వల్ల కురుస్తున్న వర్షం నీరు నేరుగా సముద్రంలోకి పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది అన్నారు. ఒక వైపు మన రాష్ట్ర ప్రభుత్వం వాల్టా చట్టం తీసుకువచ్చినా అమలు విషయంలో ఎక్కడా శ్రద్ధ కనపడటం లేదు అని విచారం వ్యక్తం చేశారు. ఇళ్లు ప్లానింగ్ లో ఇంకుడు గొయ్యలు చూపించిన వారు సైతం నిర్మాణంలో వాటి గురించి పట్టించుకోవడంలేదని బాధ వ్యక్తం చేశారు.

ఎల్ ని నో, సూపర్ ఎల్ నినో, శీతోష్ణ స్థితి వేడెక్కడం (క్లైమేట్ చేంజ్) తదితర కారణాలవల్ల వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీరు భూగర్భం లోనికి ఇంకేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పై భాగమున కురిసిన వర్షపు నీరు భూగర్భం లోనికి ఇంకేందుకు ఇంకుడు గుంతలు విరివిగా తవ్వండని కోరారు.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద గతంలో తవ్విన ఇంకుడు గుంతలు మెరుగుపరచాలని కోరారు. విశాఖ మహానగరంలో ప్రధానంగా కైలాసగిరి, సింహాచలం, యారాడ తదితర ప్రాంతాలలో కొండల చుట్టూ చిన్న చిన్న కాంటూరు కందకాలు తవ్వాలని కోరారు. చాలా పాత ఇళ్లలో ఉన్న నీటి బావుల్లోకి ఇంటి పై కప్పు మీద పడిన వర్షపు నీరు పంపించేందుకు పైప్ లైన్లు ఏర్పాటు చేయించాలని, ప్రభుత్వం ఇందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం అవసరం అని అన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం లో కురుస్తున్న వర్షం నీరు బయటకు రాకుండా ఎక్కడికక్కడ భూగర్భం లోనికి ఇంకేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. నగరం లో అయిదు వేలకు పైగా ఉన్న ఖాళీ ప్రదేశాలలో, పార్క్ లలో, కళాశాలలో ఇంకుడు గుంతలు, స్పాంజ్ బెడ్ లు ఏర్పాటు చేసిన భూగర్భ జలాలు పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అని వివరించారు.

గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షపు నీరుని దృష్టిలోకి తీసుకొని నగరంలోని ఖాళీ ప్రదేశాలలో విరివిగా చెట్లను నాటితే అందుకు తవ్విన గోతులు వల్ల భూగర్భ జలాలు పెంపొందించడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పండ్ల జాతి విత్తనాలు, పశుపక్ష్యాదుల కోసం చిరు ధాన్యాల విత్తనాలు విరివిగా కొండల మీద చల్లాలని కోరారు. వర్షాభావ పరిస్థితులలో పంటలు లేక పశుపక్ష్యాదులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన కృషి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్