Anakapalli: శెట్టిపాలెంలో రూ.15.46 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన!

Anakapalli: మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో రూ.15.46 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన. గిరిజన రైతులకు ఆదాయం, స్థానికులకు ఉపాధి.

REHAMAN, ARAKU
Published on: 13 Oct 2026 10:27 PM IST
Anakapalli
X

Anakapalli: శెట్టిపాలెంలో రూ.15.46 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన!

అనకాపల్లి జిల్లా: గిరిజన కాఫీ రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడంతో పాటు వారి ఆర్థిక అభ్యున్నతికి ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ దోహదపడుతుందని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో రూ.15.46 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌కు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడితో కలిసి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగు చేస్తున్న రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి, వారి ఉత్పత్తులకు తగిన విలువ లభించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. గిరిజన రైతుల సంక్షేమం, ఆదాయ వృద్ధికి జీసీసీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

శెట్టిపాలెంలో ఏర్పాటు చేయనున్న ఆధునిక కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కాఫీ నాణ్యత నియంత్రణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీనివల్ల కాఫీ ఉత్పత్తులకు అదనపు విలువ చేకూరడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలు విస్తరించి, రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ యూనిట్ గంటకు 4 టన్నుల కాఫీ క్యూరింగ్ సామర్థ్యంతో, 11.85 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుందని తెలిపారు. నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి, ఏప్రిల్ 2027 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

జీసీసీ ఆధ్వర్యంలోని ఆరకు వ్యాలీ కాఫీ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసి, గిరిజన కాఫీకి విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆధునిక ప్రాసెసింగ్ సదుపాయాల ద్వారా కాఫీ నాణ్యతను పెంచి, రైతుల ఉత్పత్తులకు మెరుగైన గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, జీసీసీ డైరెక్టర్లు నాగరాజు, కన్నప్పరాజు, నిబ్రహం, సంబంధిత శాఖల అధికారులు, జీసీసీ ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU