Visakhapatnam: విద్యుత్ పొదుపుపై అవగాహన పెంచాలి: ఎంపీ శ్రీభరత్
Visakhapatnam: విద్యుత్ పొదుపుపై అవగాహన పెంచాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ పిలుపునిచ్చారు; మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి 43 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.
Visakhapatnam: విద్యుత్ పొదుపుపై అవగాహన పెంచాలి: ఎంపీ శ్రీభరత్
విశాఖపట్నం: విద్యుత్‌ను పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించేలా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి ఎంపీ శ్రీభరత్ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో సుమారు 4 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పగటిపూట విద్యుత్‌ను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.
ముఖ్యంగా ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2–3 గంటల మధ్య వాషింగ్ మెషిన్లు, డిష్‌వాషర్లు, ఈవీ వాహనాల ఛార్జింగ్ వంటి అధిక విద్యుత్ వినియోగించే పరికరాలను ఉపయోగించడం ద్వారా గ్రిడ్‌పై రాత్రి వేళల్లో ఉండే భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు. విద్యుత్ పొదుపు అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి వినియోగదారుడి బాధ్యతగా భావించాలని ఎంపీ శ్రీభరత్ కోరారు.
పార్లమెంట్‌లో ఇటీవల ఎనర్జీ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా దేశ విద్యుత్ రంగానికి సంబంధించిన విధానాలు, సవాళ్లపై మరింతగా పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర అవసరాలు, విద్యుత్ రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్న అభ్యర్థులు తమ విధులను అంకితభావంతో నిర్వహించాలని శ్రీభరత్ సూచించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తమ కుటుంబ సభ్యుల సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే వారికి నిజమైన నివాళి అవుతుందని అన్నారు.
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో గత మూడేళ్లలో 2024లో 37, 2025లో 77, 2026లో ఇప్పటివరకు 43 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 2026లో నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లుగా చేరి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 2,650 మందిలో 2,234 మందిని జూనియర్ లైన్‌మెన్‌లుగా క్రమబద్ధీకరించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఏపీఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు, నూతనంగా నియమితులైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




