Makavarapalem: బాపూజీ ఆదర్శాలను భవిష్యత్ తరాలకు అందించాలి: స్పీకర్ అయ్యన్న

Makavarapalem: మాకవారిపాలెంలో గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ విగ్రహానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు నివాళులర్పించి, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 2 Oct 2026 3:16 PM IST
Makavarapalem
X

Makavarapalem: బాపూజీ ఆదర్శాలను భవిష్యత్ తరాలకు అందించాలి: స్పీకర్ అయ్యన్న

మాకవారిపాలెం: దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీ త్యాగాలు, ఆదర్శాలను నేటి సమాజంతో పాటు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మాకవారిపాలెం మండల కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లను స్పీకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

​అనంతరం గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలంగానే నేడు మనం స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు. అయితే, లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.

ఇటీవల తాను సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు, గాంధీజీని రైలు నుంచి తోసివేసిన చారిత్రక ఘట్టానికి సంబంధించిన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను, ఆయన విగ్రహాన్ని అక్కడ నేటికీ ఎంతో పవిత్రంగా, మ్యూజియంగా పటిష్టంగా నిర్వహిస్తున్న తీరును ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేశారు.

విదేశాల్లో మన దేశ మహనీయులకు అంతటి గౌరవం ఇస్తుంటే, మన దేశంలో మాత్రం పలుచోట్ల విగ్రహాలను నెలకొల్పి వాటి నిర్వహణను విస్మరించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ వారి స్మృతికి తగిన గౌరవం ఇవ్వాలని అని అన్నారు. ప్రతి ఏటా గాంధీ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

​ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సూర్య చంద్ర, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వివిధ పార్టీల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam