Visakhapatnam: ఈనెల 25న కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీల ఏర్పాటు!

Visakhapatnam: కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈనెల 25న విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు కొత్త జడ్పీలు. సిబ్బంది సర్దుబాటు చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 22 Sept 2026 12:45 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఈనెల 25న కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీల ఏర్పాటు!

Visakhapatnam: కొత్త జిల్లాల ప్రాతిపదికగా ఈనెల 25వ తేదీన జిల్లా పరిషత్లు ఏర్పాటుచేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం జిల్లా పరిషత్ యథావిధిగా కొనసాగుతుంది. కొత్తగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు జడ్పీలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న 73 మంది సిబ్బందిని మూడు జిల్లాలకు సర్దుబాటు చేశారు.

గ్రామీణ ప్రాంత జనాభా, మండలాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అనకాపల్లి జిల్లాకు 44 మందిని, అల్లూరి సీతారామరాజుకు 19 మందిని, విశాఖకు 10 మందిని కేటాయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్లో మొత్తం ఎనిమిది సెక్షన్లు ఉండేవి. కానీ అనకాపల్లి జిల్లాలో ఐదు, అల్లూరి జిల్లాలో రెండు, విశాఖ జిల్లాలో ఒక సెక్షన్ ఉండనున్నాయి. దీనికి అనుగుణంగా ఎనిమిది మంది పాలనాధికారుల్లో అనకాపల్లికి ఐదుగురిని, అల్లూరికి ఇద్దరిని, విశాఖకు ఒకరిని కేటాయించారు. అలాగే అనకాపల్లి, అల్లూరి, విశాఖ జిల్లాలకు వరుసగా సీనియర్ అసిస్టెంట్లను 7, 3, 2, జూనియర్ అసిస్టెంట్లను (మొత్తం 26 మంది)ను 16,7,3, టైపిస్టులను 3,1,1, ఆఫీస్ సబార్డినేట్లను 7,3,2 చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

కాగా ఆయా జిల్లాలకు కేటాయించబడిన సిబ్బంది (విశాఖ తప్ప) 24వ తేదీ సాయంత్రం రిలీవ్ అయి 25వ తేదీ ఉదయం కొత్త జడ్పీ కార్యాలయాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. ఇదిలావుండగా జడ్పీ సీఈవో, డిప్యూటీలు ఇక్కడే ఉంటారా? లేదా మరొక జిల్లాకు కేటాయిస్తారా?... అనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావల్సి ఉంది.

ఒకవేళ ప్రస్తుత సీఈవో, డిప్యూటీ సీఈవో ఇక్కడే ఉంటే అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు కొత్తగా సీఈవో, డిప్యూటీ సీఈవోలను నియమించాల్సి ఉంది. విశాఖ జడ్పీ పరిధిలో కేవలం నాలుగు మండలాలే ఉన్నప్పటికీ నగర పరిధిలో ఎక్కువ పాఠశాలలు ఇప్పటికీ జడ్పీ యాజమాన్యం కిందనే ఉన్నాయి.

నగరంతోపాటు నాలుగు గ్రామీణ మండలాల్లో సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరి పీఎఫ్ ఖాతాలు జడ్పీ అధికారులే నిర్వహించాల్సి ఉంది. పీఎఫ్ ఖాతాల నిర్వహణకు ఒక సెక్షన్ నిర్వహించాలి. అదేవిధంగా నగరంలో జడ్పీ ఆస్తుల రక్షణకు కొంతమంది సిబ్బంది అవసరం.

ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు ప్రస్తుతం కేటాయించిన పది మందికి అదనంగా మరికొంతమంది సిబ్బందిని మంజూరుచేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇదిలావుండగా 24వ తేదీ సాయంత్రంతో జడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగియనున్నందున మూడు జిల్లాల్లో జడ్పీ ప్రత్యేకాధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM