Narsipatnam: అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Narsipatnam: అభివృద్ధే ధ్యేయమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడి. పల్లె పండుగ 3.0 కింద నర్సీపట్నం నియోజకవర్గానికి రూ.43.59 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
Narsipatnam: అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Narsipatnam: గ్రామాల సర్వాంగీణ వికాసమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం శ్రమిస్తోందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా మాకవరపాలెం మండలం, శెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గర్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీన్' (VB G RAM G) గ్రాంట్ కింద మన రాష్ట్రానికి రూ.11,085 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.5,391 కోట్లు (50 శాతం) కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5,694 కోట్లు (50 శాతం) గా ఉందన్నారు.
నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని 421 అభివృద్ధి పనుల కోసం రూ.43 కోట్ల 59 లక్షల గ్రాంట్ కేటాయించినట్లు స్పీకర్ తెలిపారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా నిధుల వివరాలను వెల్లడిస్తూ.. మాకవరపాలెం మండలానికి 76 వర్కులకు గాను రూ.10 కోట్ల 10 లక్షలు, నాతవరం మండలానికి 148 వర్కులకు రూ.21 కోట్ల 86 లక్షలు, నర్సీపట్నం మండలానికి 104 వర్కులకు రూ.5 కోట్ల 38 లక్షలు, అలాగే గొలుగొండ మండలానికి 93 వర్కులకు గాను రూ.6 కోట్ల 26 లక్షల గ్రాంట్ ఇచ్చామని వివరించారు. గతంలో మాకవరపాలెం మండలానికి అందించిన రూ.114 కోట్ల అభివృద్ధి నిధులతో పాటు, ఇప్పుడు కేటాయించిన రూ.10.10 కోట్లతో కలిపి మొత్తం రూ.124 కోట్ల గ్రాంట్ మంజూరు చేశామని తెలిపారు. దీనికి అదనంగా ప్రాంతీయ ఉపాధి ప్రోత్సాహకం కింద రూ.10 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రత్యేకంగా శెట్టిపాలెం పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఇప్పటివరకు ఈ ఒక్క పంచాయతీకే రూ.3 కోట్ల 52 లక్షల విలువైన పనులు మంజూరు చేశామని స్పీకర్ తెలిపారు. ఇందులో మొదటగా 12 వర్కులకు గాను రూ.2 కోట్ల 12 లక్షలు ఇవ్వగా, తాజాగా మరో రూ.40 లక్షలతో 2 కొత్త రోడ్లను, రామాలయ నిర్మాణానికి రూ.1 కోటి నిధులను కేటాయించినట్లు స్పష్టం చేశారు. గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సూర్యచంద్ర, పాలెం మండలం పార్టీ ప్రెసిడెంట్ ఆర్ వై పాత్రుడు, అల్లు నాయుడు, నందకిషోర్, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




