Narsipatnam: నర్సీపట్నంలో అంతర్జాతీయ గంజాయి ముఠా అరెస్ట్

Narsipatnam: నర్సీపట్నంలో ఇండియా నుంచి శ్రీలంకకు గంజాయి తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 1.33 కోట్ల విలువైన 230 కేజీల గంజాయి స్వాధీనం.

R. A. Naidu, Narsipatnam
Published on: 19 Oct 2026 4:12 PM IST
Narsipatnam
X

Narsipatnam: నర్సీపట్నంలో అంతర్జాతీయ గంజాయి ముఠా అరెస్ట్

నర్సీపట్నం: ఇండియా నుంచి శ్రీలంకకు గంజాయిని తరలించే అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠాను నర్సీపట్నం రూరల్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. కోటి 33 లక్షల 70 వేల రూపాయల విలువైన 230 కిలోల గంజాయి, ఒక కారు, బైకు, లక్ష 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు సోమవారం మధ్యాహ్నం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అరెస్ట్ అయిన ముఠా సభ్యుల్లో ప్రధాన నిందితుడు శశి కుమార్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఒడిస్సా అటవీ ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, తంజావూరు, ప్రాంతాలతో పాటు శ్రీలంకకు తరలిస్తాడు.

2 కేజీలు, 1 కేజీ, అరకేజీ ,పావు కేజీ, ప్యాకెట్లుగా గంజాయిని విడగొట్టి విక్రయాలు జరుపుతుంటాడు. మరో ముద్దాయి అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలానికి చెందిన పాంగి సుబ్బారావు తన స్వగ్రామమైన బూరుగుపనుకుల గ్రామానికి ఈ స్మగ్లింగ్ ముఠాను రమ్మని 230 కేజీల గంజాయిని వీరికి సమకూర్చాడు. ఒడిస్సా లోని జంతా పాయి గ్రామంలో కిలో గంజాయిని 5 వేల రూపాయల చొప్పున కొనుగోలు చేశారు.

గంజాయి కొనుగోలులో సుబ్బారావు కీలక పాత్ర పోషించాడు. మరో ముద్దాయి వంతల చిట్టిబాబు గంజాయి కేసులోనే తమిళనాడులోని పుదు కొట్టయి జిల్లా జైల్లో మూడు సంవత్సరాల పాటు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో ప్రధాన నిందితుడు శశి కుమార్ తో పరిచయం పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత వీరు ముఠాగా ఏర్పడి గంజాయిని ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు.

ప్రధాన నిందితుడు శశి కుమార్ గంజాయి రవాణా కోసం తమిళనాడు రాష్ట్రానికే చెందిన తన స్నేహితులైన అమల రాజ్, మణికందన్ చంద్రకుమార్ ను తన ముఠాలో చేర్చుకున్నాడు. మూడు లక్షల రూపాయల నగదు సమకూర్చుకొని ఒక కారును అద్దెకి తీసుకున్నాడు. ఈనెల 14వ తేదీన తమిళనాడు నుంచి బయలుదేరి అల్లూరి సీతారామరాజు జిల్లాకు వచ్చారు.

అక్కడ 230 కేజీల గంజాయిని కొనుగోలు చేసి అడ్వాన్స్ గా 1,50,000 చెల్లించారు. మిగతా నగదును గంజాయి తుని హైవే కు చేర్చిన తర్వాత ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 230 కేజీల గంజాయిని పది ప్లాస్టిక్ సంచులలో ఒక్కో సంచిలో 23 కేజీల చొప్పున ప్యాకింగ్ చేశారు.

ఈ సరుకును శ్రీలంకకు తరలించే క్రమంలో సోమవారం ఉదయం నర్సీపట్నం మండలం గబ్బడ గ్రామ శివార్లలో ఉన్న అడ్డదారులకు చేరుకోగానే, ముందస్తు సమాచారం మేరకు పోలీసులు మాటవేసి ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడిలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, రూరల్ ఎస్సై రాజారావు, గొలుగొండ ఎస్సై రామారావు, కృష్ణదేవిపేట ఎస్సై రిషికేశ్వరరావు, తమ సిబ్బందితో పాల్గొన్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు కానిస్టేబుళ్లకు డిఎస్పి శ్రీనివాసరావు నగదు రివార్డ్ లను అందజేశారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam