Narsipatnam: ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రాధాన్యత తగదు

Narsipatnam: నర్సీపట్నంలో వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు పార్టీలో ప్రాధాన్యత కల్పించడంపై బీజేపీ నేత శివ నారాయణ రాజు ఆందోళన వ్యక్తం చేశారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 1 Oct 2026 4:02 PM IST
Narsipatnam
X

Narsipatnam: ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రాధాన్యత తగదు

నర్సీపట్నం: వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను గతంలో బీజేపీ పార్టీ పక్కన పెట్టినప్పటికీ, ప్రస్తుతం వారితో సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ పదాధికారులు, నాయకులు ప్రశ్నిస్తున్నారని బీజేపీ మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. శివ నారాయణ రాజు పేర్కొన్నారు.

నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుతం ఎటువంటి బాధ్యతలు లేని కొందరు నాయకులకు సమావేశాల్లో ప్రాధాన్యత కల్పించడం, గతంలో పార్టీకి దూరంగా ఉంచిన వ్యక్తులకు తిరిగి ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందన్నారు.

ప్రత్యేకంగా నర్సీపట్నం కేంద్రంగా “స్మార్ట్ విలేజ్”, “స్వచ్ఛ భారత్” వంటి కార్యక్రమాల పేరుతో యువతీ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై తాను ఆర్‌ఎస్‌ఎస్ మరియు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో, పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం పార్టీ వర్గాల్లో తెలిసిందేనన్నారు. ఆ కమిటీ నివేదికలో పలువురు నాయకుల ప్రమేయానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించబడ్డాయని కార్యకర్తలు చెబుతున్నారని తెలిపారు.

ఈ వ్యవహారంపై రాష్ట్ర సీఐడీ విచారణ కొనసాగుతోందని, కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో, ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు లేదా వారి కుటుంబ సభ్యులకు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో పార్టీ నాయకత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సంబంధించిన అంశాల్లో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకుండా, అన్ని విషయాలను నిష్పక్షపాతంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలను పక్కన పెట్టి, వివాదాస్పద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత కల్పిస్తే, అది పార్టీ క్షేత్రస్థాయి బలంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

“పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల కంటే, పార్టీకి గతంలో దూరంగా ఉంచిన వ్యక్తులకే మళ్లీ ప్రాధాన్యత లభిస్తే, నిజాయితీగా పనిచేస్తున్న కార్యకర్తల్లో ఏ భావన కలుగుతుందో నాయకత్వం ఆలోచించాలి” అని శివ నారాయణ రాజు అన్నారు.

ఇటీవల పార్టీకి సంబంధించిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా జిల్లా ఓబీసీ అధ్యక్షుల రాజీనామా వంటి అంశాలు కూడా కార్యకర్తల్లో ఆందోళనకు కారణమవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే జిల్లా ఓబీసీ అధ్యక్షులు తమ రాజీనామాలను సమర్పించిన నేపథ్యంలో, ఈ పరిణామాలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి ఏర్పడుతుందేమోనన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది అని పేర్కొన్నారు. అందువల్ల ఈ అంశాన్ని వ్యక్తిగత కోణంలో చూడకుండా, పార్టీ ప్రయోజనం, కూటమి ప్రయోజనం, కార్యకర్తల మనోభావాలు అనే మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా నిలిచి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా, బీజేపీ జిల్లా నాయకత్వం కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి, పార్టీ ఐక్యతను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు ఐక్యంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపైనా ఉంది. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తకు న్యాయం జరిగితేనే… పార్టీ బలపడుతుంది. పార్టీ బలపడితేనే… కూటమి గెలుస్తుంది.

ఈ ప్రకటనను తాను వ్యక్తిగత విమర్శలు లేదా వ్యక్తిగత దూషణల కోసం కాకుండా, పార్టీ ప్రయోజనాలు, పార్టీ అభివృద్ధి, కార్యకర్తల మనోభావాలు మరియు కూటమి విజయాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నానని కె. శివ నారాయణ రాజు స్పష్టం చేశారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam