Nakkapalli: 110 పంచాయతీల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: హోంమంత్రి!
Nakkapalli: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గంలోని 110 పంచాయతీల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు.
Nakkapalli: 110 పంచాయతీల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: హోంమంత్రి!
నక్కపల్లి,నవంబర్ 28: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఈ నెల 29న జరగనున్న నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నియోజకవర్గంలోని 110 గ్రామ పంచాయతీల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గ్రామాల అభివృద్ధి బాధ్యతను తాము తీసుకుంటున్నామని, అభివృద్ధి పనులు చేసినందునే ప్రజలను ఓట్లు అడిగే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు రూ.1,200 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు అనిత గుర్తుచేశారు. అయితే గత వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, కనీసం రోడ్ల నిర్మాణం కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో ప్రజలు తనపై నమ్మకంతో సుమారు 40 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి ఆశీస్సులతో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గం పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.
స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, టాయ్ పార్క్ వంటి పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువచ్చామని, ఆ నీటితో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
గ్రామాల్లో పరిశుభ్రతకు, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గత రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. గ్రామాల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని, అభివృద్ధిని కొనసాగించాలంటే సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని మంత్రి అనిత పిలుపునిచ్చారు.
ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించారని, పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకుందని గుర్తుచేశారు. అదే ప్రజాభిమానాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరారు. నియోజకవర్గంలోని మొత్తం 110 పంచాయతీల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




