Bheemili: సీహెచ్‌సీలో నూతన వైద్య సదుపాయాలు ప్రారంభించిన ఎంపీ భరత్

Bheemili: భీమిలి సీహెచ్‌సీలో రూ. 28 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన నూతన వైద్య సదుపాయాలను విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 10 Oct 2026 4:18 PM IST
Bheemili
X

Bheemili: సీహెచ్‌సీలో నూతన వైద్య సదుపాయాలు ప్రారంభించిన ఎంపీ భరత్

భీమిలి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా వైద్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. భీమిలి టౌన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.28 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన వైద్య సదుపాయాలు, అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSIDC) ద్వారా ఈ పనులను పూర్తి చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటే సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. రోగులు, ముఖ్యంగా గర్భిణులు, నవజాత శిశువులు, శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి మెరుగైన సేవలు అందేలా అవసరమైన వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

నవజాత శిశువుల కోసం ప్రత్యేక ఫోటోథెరపీ గది

నవజాత శిశువుల్లో కామెర్లు వంటి సమస్యలకు చికిత్స అందించేందుకు అవసరమైన ఫోటోథెరపీ యంత్రాలను ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక గదిని అభివృద్ధి చేశారు. నాలుగు యంత్రాలను అమర్చేందుకు అనువుగా ఈ గదిని తీర్చిదిద్దారు. దీనివల్ల శిశువులకు అవసరమైన చికిత్సను మరింత సౌకర్యవంతంగా అందించేందుకు అవకాశం కలుగుతుంది.

శస్త్రచికిత్సలకు ముందు రోగులను సిద్ధం చేసేందుకు ప్రత్యేక గది

ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్సలకు ముందు రోగులను సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ప్రీ-ఆపరేటివ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఈ సదుపాయం లేక రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ గది ఉపయోగపడుతుందని ఎంపీ తెలిపారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్సలకు సంబంధించిన ఏర్పాట్లు మరింత క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

అల్ట్రాసౌండ్ యంత్రం, ఇతర అభివృద్ధి పనులు

రోగులకు అవసరమైన నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు నూతన అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనితో పాటు ఆసుపత్రిలో అవసరమైన మరమ్మతులు, ఆధునికీకరణ పనులను చేపట్టి వైద్య సేవలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించారు.

భీమిలి సీహెచ్‌సీ మరింత అభివృద్ధికి కృషి

భీమిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసి, రోగులకు మెరుగైన సేవలు అందించే స్థాయికి తీసుకెళ్లేందుకు అదనపు నిధుల అవసరం ఉందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. ఆసుపత్రి పై అంతస్తులో అదనపు వార్డుల నిర్మాణం సహా మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు అవసరమవుతాయని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్‌ సమకూర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎంపీ లాడ్స్ నిధులను ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పనులకు వినియోగించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ముఖ్యంగా వైద్యం, విద్యారంగాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.