Paderu: ఏజెన్సీలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి ఎమ్మెల్సీ కుంభా రవిబాబు!

Paderu: అల్లూరి ఏజెన్సీలో వర్షాల నష్టంపై కలెక్టర్‌కు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు లేఖ. తక్షణ సహాయక చర్యలు, వంతెనలు, రోడ్ల పునరుద్ధరణకు డిమాండ్.

REHAMAN, ARAKU
Published on: 29 Sept 2026 2:16 PM IST
Paderu
X

Paderu: ఏజెన్సీలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి ఎమ్మెల్సీ కుంభా రవిబాబు!

Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు లేఖ రాశారు. బాధిత గిరిజన కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంతో పాటు దెబ్బతిన్న రహదారులు, వంతెనలను వెంటనే పునరుద్ధరించాలని లేఖలో కోరారు.

పాడేరు, అరకులోయ, డుంబ్రిగూడ, జి.కె.వీధి, చింతపల్లి, ముంచంగిపుట్టు, పెదబయలు, అనంతగిరి, హుకుంపేట తదితర ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడం, వరదలు, కొండచరియలు విరిగిపడటం, రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాలకు నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

ముంచంగిపుట్టు మండలం దొడిపుట్టు గ్రామపంచాయతీ పరిధిలో వాగులు పొంగిపొర్లడంతో స్థానిక ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. అలాగే అనంతగిరి మండలం ఒనుగొండ, పరిసర గిరిజన ఆవాసాలు సహా పలు మారుమూల గ్రామాల్లో రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో కనెక్టివిటీ సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు.

భారీ వర్షాల కారణంగా గిరిజన కుటుంబాల నివాస గృహాలు దెబ్బతినడం, గోడలు కూలిపోవడం, ఇళ్లలోకి వరద నీరు చేరడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. అధిక వర్షపాతం, నీటిముంపు కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇళ్లు, రహదారులు, వంతెనలు, పంటలు, ఇతర మౌలిక వసతులకు జరిగిన నష్టంపై తక్షణమే సమగ్ర క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు జిల్లా కలెక్టర్‌ను కోరారు. నష్టపోయిన అర్హులైన కుటుంబాలకు నిబంధనల ప్రకారం తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి కనెక్టివిటీని వీలైనంత త్వరగా పునరుద్ధరించి, నిత్యావసర సరుకులు, వైద్య సేవలు, ఇతర అత్యవసర సహాయం అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU