Anakapalli: తాళ్లపాలెం వద్ద పోలవరం కాలువ లీకేజీ: ఎమ్మెల్యే కొణతాల పరిశీలన!
Anakapalli: తాళ్లపాలెం సంత వద్ద పోలవరం ఎడమ కాలువ లీకేజీని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు. ప్రజల రక్షణకు తక్షణమే రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని ఆదేశించారు.
Anakapalli: తాళ్లపాలెం వద్ద పోలవరం కాలువ లీకేజీ: ఎమ్మెల్యే కొణతాల పరిశీలన!
అనకాపల్లి: తాళ్లపాలెం సంత ప్రాంత ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పోలవరం ఎడమ కాలువ గట్టుకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులను ఆదేశించారు. తాళ్లపాలెం సంత ప్రాంతం వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి లీకేజీ వస్తున్న విషయం వాస్తవమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కూటమి నాయకులతో కలిసి అధికారులతో కాలువ పరిసర ప్రాంతాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను స్వయంగా కలిసి కాలువ లీకేజీ, గట్టు పరిస్థితి, నీటి ప్రవాహం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.
కాలువలో లీకేజీ లేదని చెప్పడం కంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించి, భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదం జరగకుండా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
తాళ్లపాలెం సంత వైపు పోలవరం కాలువ గట్టుకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని, మరోవైపు ఏలేరు కాలువ గట్టుకు కూడా అవసరమైన చోట రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. గట్టు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రక్షణ గోడలతో పాటు అవసరమైన కాలువ నిర్మాణ పనులు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.
పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ప్రాజెక్టు ఈఈ తాళ్లపాలెం ప్రాంతానికి రావాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు
కాలువ లీకేజీ కారణంగా తాళ్లపాలెం సంత ప్రాంత ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
ప్రజల సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకుని, అధికారులను అప్రమత్తం చేసి, శాశ్వత రక్షణ చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.




