Anakapalle: కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అనకాపల్లి అభివృద్ధి వేగవంతం!

Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ 108, 109 వార్డుల్లో కూటమి ఆత్మీయ సమావేశం. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అనకాపల్లి అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పిలుపు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 30 Oct 2026 6:16 AM IST
Anakapalle
X

Anakapalle: కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అనకాపల్లి అభివృద్ధి వేగవంతం!

Anakapalle: రానున్న జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 108, 109వ వార్డుల కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు

. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో 108, 109వ వార్డులకు చెందిన కూటమి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని వివరించారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పట్టణ అభివృద్ధిలో మహిళా ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

అనకాపల్లి అభివృద్ధికి రూ.100 కోట్ల పనులు!

అనకాపల్లి జిల్లాలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, తద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని కొణతాల రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి పట్టణంలో సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు.

ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు, మెరుగైన రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయవచ్చని అన్నారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లికి పూర్వ వైభవం తీసుకురావాలంటే ప్రజల సహకారం అవసరమని పేర్కొంటూ, 108, 109వ వార్డుల కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI