Anakapalle: అనకాపల్లిలో దివ్యాంగులకు 52 త్రిచక్ర వాహనాల పంపిణీ!
Anakapalle: అనకాపల్లి కలెక్టరేట్‌లో 52 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయకృష్ణన్.
Anakapalle: అనకాపల్లిలో దివ్యాంగులకు 52 త్రిచక్ర వాహనాల పంపిణీ!
Anakapalle: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలు అందించడంతో పాటు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్య, శిక్షణ, సంరక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన మూడు చక్రాల స్కూటీ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలి విడతగా జిల్లాలో 52 ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. దివ్యాంగులకు అందించే సహాయ పరికరాలు వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తిగా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల సహకారంతో పరికరాలను వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్య అవసరం మానసిక, శారీరక అభివృద్ధిలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్య, శిక్షణ, సంరక్షణ అందించడం అత్యంత ముఖ్యమని కొణతాల పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక పాఠశాలల ఏర్పాటుకు కృషి జరగాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించి పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా శిక్షణ అందించాలని అన్నారు.
ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కృషిని ఆయన అభినందించారు.
దివ్యాంగ పిల్లలను ప్రోత్సహించాలి
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ఇళ్లకే పరిమితం చేయకుండా తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు తీసుకురావాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. సరైన శిక్షణ, నిరంతర ప్రోత్సాహం అందిస్తే పిల్లలు తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. దివ్యాంగులు గౌరవప్రదమైన జీవితం గడిపేలా కుటుంబ సభ్యులతో పాటు సమాజం కూడా వారికి అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావుతో పాటు సంబంధిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.




