Anakapalli: స్థానికులకే టికెట్ ఇవ్వాలని జనసైనికుల డిమాండ్!
Anakapalli: అనకాపల్లి 107వ వార్డు కార్పొరేటర్ టికెట్ కేటాయింపుపై జనసైనికుల నిరసన. స్థానికులకే సీటు ఇవ్వాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ భీమరశెట్టి రాంకీకి వినతిపత్రం.
Anakapalli: స్థానికులకే టికెట్ ఇవ్వాలని జనసైనికుల డిమాండ్!
Anakapalli: అనకాపల్లి జోన్-10లోని 107వ వార్డు కార్పొరేటర్ టికెట్ కేటాయింపు చుట్టూ చర్చ వేడెక్కుతోంది. 14 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న స్థానికులకు గుర్తింపు ఎక్కడ? స్థానికులను కాదని ఇతరులకు అవకాశం ఇస్తే ఎలా? అంటూ జనసైనికులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. స్థానికులకే కార్పొరేటర్ సీటు కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.
107వ వార్డు జనసేన ఇన్చార్జి చేబ్రోలు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జనసైనికులు అనకాపల్లి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి భీమరశెట్టి రాంకీకి వినతిపత్రం అందజేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న స్థానిక నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆరు వార్డులు.. ఆశావహుల్లో ఉత్కంఠ!
జోన్-10లో ఆరు వార్డులకూ మహిళా రిజర్వేషన్ అమలైన నేపథ్యంలో పురుష ఆశావహులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో తమ కుటుంబ సభ్యులకైనా టికెట్ దక్కాలని ఆశిస్తున్న స్థానిక నాయకులు, ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ క్రమంలో 107వ వార్డు సీటు ఎవరికి దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
స్థానికతకే ప్రాధాన్యత ఇవ్వాలంటున్న విలీన గ్రామాలు!
కొప్పాక, సిరసపల్లి, రాజుపాలెం, కొత్తూరు, వల్లూరు, ఎరుకవానిపాలెం తదితర ప్రాంతాలతో కూడిన 107వ వార్డులో మొత్తం 12,032 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,331 మంది మహిళలు, 5,701 మంది పురుషులు ఉన్నట్లు స్థానిక నాయకులు వెల్లడించారు.
“మాకు టికెట్ వచ్చినా, రాకపోయినా స్థానికులకే అవకాశం ఇవ్వాలి” అన్నది తమ ప్రధాన డిమాండ్ అని నాయకులు చెబుతున్నారు. వార్డులోని సమస్యలు తెలిసిన, ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక ప్రతినిధులకే అవకాశం కల్పిస్తే అభివృద్ధికి మరింత కృషి చేసే వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు.
అధిష్టానం నిర్ణయంపైనే ఆశలు!
107వ వార్డులో టికెట్ ఆశిస్తున్న నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు, స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ను జనసైనికులు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల అర్హతలు, పార్టీ కోసం చేసిన కృషి, స్థానిక ప్రజలతో ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
మరి 107వ వార్డులో స్థానికుల డిమాండ్కు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందా? పార్టీ కోసం కష్టపడిన నాయకులకు గుర్తింపు లభిస్తుందా? మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో టికెట్ ఎవరికి దక్కుతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలే వార్డులో రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి.




