Anakapalle: అనకాపల్లిలో స్థానిక ఎన్నికలపై జనసేన అత్యవసర భేటీ!
Anakapalle: అనకాపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అత్యవసర సమావేశం. జీవీఎంసీ 6 డివిజన్లలో పార్టీ పరిస్థితి, బూత్ స్థాయి బలోపేతంపై కీలక చర్చ.
Anakapalle: అనకాపల్లిలో స్థానిక ఎన్నికలపై జనసేన అత్యవసర భేటీ!
Anakapalle: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు డాక్టర్ పంచకర్ల సందీప్, గ్రంథాలయ చైర్మన్ వన్నంరెడ్డి సతీష్, గవర సోమశేఖర్, పసుపులేటి ఉషాకిరణ్ తదితరులు హాజరయ్యారు.
జీవీఎంసీ పరిధిలోని ఆరు డివిజన్లకు చెందిన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితి, నాయకులు–కార్యకర్తల సమన్వయం, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై నాయకులు ముఖాముఖిగా చర్చించారు.
ఈ సందర్భంగా వార్డు స్థాయి నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. ఆరు డివిజన్లలో పార్టీ అధిష్టానం ఎన్ని సీట్లు కేటాయించినా కొణతాల రామకృష్ణ మార్గదర్శకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు.
బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ నాయకులు, జనసైనికులు సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలని నాయకులు సూచించారు.
ఈ సమావేశంలో ఆరు డివిజన్లకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.




