Visakhapatnam: విశాఖ మంగమారిపేటలో అక్రమ నిర్మాణాల కలకలం!
Visakhapatnam: విశాఖ భీమిలి మండలం మంగమారిపేటలో ఐదు అంతస్తుల అక్రమ నిర్మాణంపై వివాదం. కోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై విమర్శలు.
Visakhapatnam: విశాఖ మంగమారిపేటలో అక్రమ నిర్మాణాల కలకలం!
Visakhapatnam: విశాఖ జిల్లా భీమిలి మండలం మంగమారిపేటలో అక్రమ నిర్మాణంపై వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. వైజాగ్ బీచ్ రోడ్డుకు సమీపంలోని సర్వే నంబర్ 314లో రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నిర్మాణంపై కొంతమంది స్థానికులు కోర్టును ఆశ్రయించగా, నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ కోర్టు ఉత్తర్వుల ప్రతిని అధికారులకు అందించినట్లు స్థానికులు చెబుతున్నారు. నిర్మాణదారుడు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించినట్లు వారు పేర్కొంటున్నారు. అయినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతూ భవనం ప్లాస్టరింగ్ దశకు చేరుకుంటోందని ఆరోపిస్తున్నారు.
కోర్టు వ్యవహారం నడుస్తున్నా, ఫిర్యాదులు అందినా సంబంధిత మున్సిపల్ యంత్రాంగం, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యత కలిగిన ఏసీపీ విభాగం తూతూమంత్రంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులకు మించి నిర్మాణం జరిగితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం వహించడం వెనుక కారణమేంటి? భవనం పూర్తయ్యే వరకు అధికారులు వేచి చూస్తున్నారా? అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగం ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుందా.




