Visakhapatnam: ఐఐఎం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అడ్మిషన్లు

Visakhapatnam: ఐఐఎం విశాఖపట్నం ఉద్యోగుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ నాలుగో బ్యాచ్ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది.

Narsimha Reddy
Published on: 17 Sept 2026 7:53 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఐఐఎం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అడ్మిషన్లు

విశాఖపట్నం: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం తమ ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఈఎంబీఏ) ప్రోగ్రామ్ నాలుగో బ్యాచ్ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది.

ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోర్సు, అధునాతన నిర్వహణ నైపుణ్యాలను కృత్రిమ మేధ అప్లికేషన్లతో అనుసంధానిస్తుంది. వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ రంగంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంస్థాగత మార్పులకు నాయకత్వం వహించడానికి, వ్యాపారాభివృద్ధిని సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది.

క్యాంపస్‌లో 'లీడింగ్ వాట్స్ నెక్స్ట్: ఫ్రమ్ ఎక్స్‌పీరియన్స్ టు రెడీనెస్' పేరిట నిర్వహించిన చర్చా గోష్ఠి సందర్భంగా దీనిని ప్రారంభించారు. ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం చంద్రశేఖర్ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ (హెచ్ఆర్) రాజ్ కుమార్ దూబే ముఖ్య అతిథిగా విచ్చేశారు.

​పరిశ్రమ-విద్యా రంగాల మధ్య నాయకత్వం, నైపుణ్యాలు, పరివర్తనపై సాగిన ఈ చర్చలో పారిశ్రామిక మార్పులు, మారుతున్న నాయకత్వ అంచనాలు, వృత్తిపరమైన సన్నద్ధత, సంస్థలు, శ్రామిక శక్తిపై సాంకేతిక మార్పుల ప్రభావం వంటి అంశాలను చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈఎంబీఏ బ్రోచర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ మారుతున్న అంతర్జాతీయ వ్యాపార ముఖచిత్రాన్ని ప్రస్తావిస్తూ సాంకేతికత, మార్కెట్లు, సంస్థాగత అంచనాలు నిరంతరం మారుతున్నందున నిపుణులు ముందుగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు సాంకేతికత, మార్కెట్లలోని ఒడిదుడుకులు, వేగవంతమైన, మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత వ్యాపార నాయకత్వాన్ని పునర్నిర్వచిస్తున్నాయని చెప్పారు.

అంతరాయాలు, సంక్షోభాలు డిమాండ్ చేయడానికి ముందే నిపుణులు తమ సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. సంస్థలను నిరంతర అభివృద్ధి దిశగా విశ్వాసంతో నడిపించడానికి మేనేజ్‌మెంట్ నైపుణ్యం, డిజిటల్ పరిజ్ఞానం, పరిస్థితులకు తట్టుకునే దృఢత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ రెండేళ్ల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ 740 కంటే ఎక్కువ గంటల ఇంటరాక్టివ్ ఎగ్జిక్యూటివ్ లెర్నింగ్‌ను కలిగి ఉంటుందన్నారు.

ఇది వ్యాపారం, నిర్వహణ, వ్యూహాత్మక నిర్ణయాధికారంలో బలమైన వృత్తిపరమైన పునాదిని నిర్మించడంపై దృష్టి సారిస్తుందన్నారు. డేటా, విశ్లేషణలు, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఉత్పాదకత, సమస్యల పరిష్కారం, వ్యాపార పని తీరును మెరుగుపరచడానికి కృత్రిమ మేధ సాధనాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.

ఈ ప్రోగ్రామ్‌లో డెన్మార్క్‌కు చెందిన డీసీఏసీ సహకారంతో మూడు రోజుల (ఆప్షనల్) ఎక్స్‌క్లూజివ్ గ్లోబల్ లెర్నింగ్ ఇన్నోవేషన్ బూట్‌క్యాంప్ కూడా ఉంటుందన్నారు. ఇది పని సంస్కృతి విలువలు, అక్కడి వ్యాపార వాతావరణంపై అవగాహన కల్పిస్తుందన్నారు.

ఇందులో పాల్గొనేవారు డానిష్ మేనేజర్లు, ఉద్యోగులతో క్షేత్రస్థాయి పరిశోధన చేసి, తమ పరిశీలనలను ఏఐ డిజిటల్ సాధనాల ద్వారా విశ్లేషణలు, త్వరగా ప్రోటోటైప్ కాన్సెప్ట్‌లుగా రూపొందిస్తారన్నారు. దీనికి అదనంగా, ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్‌లో రెండు విడతలుగా ఐదు రోజుల చొప్పున క్యాంపస్ ఇమ్మర్షన్ మాడ్యూల్స్ ఉంటాయన్నారు.

ఈ సందర్భంగా ఐఐఎం విశాఖపట్నం ఈఎంబీఏ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ అభిషేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈఎంబీఏ ప్రాముఖ్యత కేవలం మేనేజ్‌మెంట్ సిద్ధాంతాలను మళ్లీ నెమరువేసుకోవడంలో లేదన్నారు. నిపుణులు తమకు తెలిసిన వ్యాపార సవాళ్లను మరింత విస్తృతమైన, విశ్లేషణాత్మక కోణంలో పరిశీలించేలా చేయడమే దీని అసలు ఉద్దేశం అన్నారు.

విద్యార్థుల ఆలోచనా పరిధిని విస్తరించడానికి, నిర్ణయాధికారాన్ని పదును పెట్టడానికి, నేర్చుకున్న అంశాలను విభిన్న సంస్థాగత పరిస్థితులలో సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా మా పాఠ్యప్రణాళిక, క్యాంపస్ ఇమ్మర్షన్లు, ఆసక్తి ఉన్న వారికి డెన్మార్క్ అధ్యయన పర్యటనను రూపొందించామని తెలిపారు. గత బ్యాచ్‌లలో ఐటీ, బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఎడ్‌టెక్, హెల్త్‌కేర్, టెలికమ్యూనికేషన్స్ వంటి కీలక రంగాలకు చెందిన మధ్యస్థాయి నుంచి ఉన్నత స్థాయి నిపుణులు చేరారన్నారు.

ఈ ప్రోగ్రామ్‌లో చేరుతున్న వారిలో దాదాపు 60 శాతం మంది 8 నుంచి 20 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారే కావడం విశేషమన్నారు. ఏఐ ఆధారిత ఈ పాఠ్యప్రణాళిక రెండేళ్ల వ్యవధిలో మొత్తం ఆరు టర్మ్‌లలో కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా మార్కెటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్ & అకౌంటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రొడక్షన్ & ఆపరేషన్స్, స్ట్రాటజీ, ఎంట్రప్రెన్యూర్‌షిప్ వంటి కీలక మేనేజ్‌మెంట్ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. రెండవ సంవత్సరంలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఎథిక్స్ & చట్టాలు వంటి అంశాలపై దృష్టి సారిస్తారన్నారు. వీటితో పాటు మూడు టర్మ్‌లలో ఒక్కో టర్మ్‌కు ఐదు ఎలెక్టివ్‌లు, చివరిదైన 6వ టర్మ్‌లో క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ ఉంటాయన్నారు.

ఈ ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఈఎంబీఏ) తరగతులు ఉపన్యాసాలు, వాస్తవ కేస్ స్టడీలు, క్విజ్‌లు, అసైన్‌మెంట్ల కలయికతో సాగుతాయి. ఇది అత్యాధునిక ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 'డైరెక్ట్-టు-డివైస్' (డీ2డీ) విధానంలో అందించబడుతుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ డిగ్రీతో పాటు ఐఐఎం విశాఖపట్నం పూర్వ విద్యార్థుల (అలుమ్ని) హోదా లభిస్తుంది.

ప్రీ-ఈఎంబీఏ లీడర్‌షిప్ జర్నీ, సీఎక్స్ఓ మాస్టర్‌క్లాస్ సిరీస్, ఇండస్ట్రీ ఇన్‌సైట్స్ సిరీస్ వంటి విలువైన అదనపు విద్యా అనుభవాలను కూడా ఈ కార్యక్రమం అందిస్తుంది. ప్రవేశాలు ఈమ్యాట్, వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించిన సమగ్ర స్కోరు (కాంపోజిట్ స్కోర్) ద్వారా జరుగుతాయి. క్యాట్, జీఆర్ఈ, జీమ్యాట్ స్కోర్లు ఉన్న అభ్యర్థులకు ఈమ్యాట్ పరీక్ష నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది.

దరఖాస్తుదారులు కనీసం 50 శాతం మార్కులు లేదా తత్సమాన సీజీపీఏతో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ అర్హత పరిమితి ఎన్సీ-ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ కేటగిరీల అభ్యర్థులకు 45 శాతం, ఎస్సీ, ఎస్డీ, పీడబ్ల్యుడీ కేటగిరీల వారికి 40 శాతం నిర్ణయించారు. వీటితో పాటు, దరఖాస్తుదారులకు అధికారి/ఎగ్జిక్యూటివ్ లేదా అంతకంటే ఉన్నత స్థాయిలో, ఉద్యోగిగా లేదా వ్యవస్థాపకుడిగా (ఎంట్రప్రెన్యూర్‌గా) కనీసం మూడేళ్ల పూర్తి కాల పని అనుభవం తప్పనిసరి.

Narsimha Reddy

Narsimha Reddy