Anakapalle: కూటమి భారీ ప్రచార యాత్ర రేసులో మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి

Anakapalle: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి, 107-112 వార్డుల అభ్యర్థుల కోసం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల విస్తృత ప్రచారం చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 27 Oct 2026 1:37 PM IST
Anakapalle
X

Anakapalle: కూటమి భారీ ప్రచార యాత్ర రేసులో మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి

Anakapalle: జీవీఎంసీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లిలో కూటమి అభ్యర్థుల తరఫున నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థిని ముక్కా శ్రావణితో పాటు 107వ వార్డు నుంచి 112వ వార్డు వరకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు పాల్గొన్న ప్రచార యాత్ర సందడిగా సాగింది. సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకు నిర్వహించిన ఈ ప్రచార ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ ప్రచార యాత్రలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, ఏపీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. వారితో పాటు మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తదితర కూటమి నాయకులు ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు. సినీ నటుడు జెమినీ గణేష్ పాల్గొనడం ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ ప్రచారంలో భాగంగా 107వ వార్డు అభ్యర్థి మాదంశెట్టి చిన్నతల్లి, 108వ వార్డు అభ్యర్థి కొణతాల సింధుజ, 109వ వార్డు అభ్యర్థి బుద్ధ జ్యోతి, 110వ వార్డు అభ్యర్థి తాడి శాంతికుమారి, 111వ వార్డు అభ్యర్థి పలక యశోద, 112వ వార్డు అభ్యర్థి ఆళ్ల వైష్ణవి ప్రజలను కలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, అనకాపల్లి ప్రాంత అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే జీవీఎంసీ స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ప్రజా సంక్షేమం, స్థానిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ప్రచార యాత్రలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI