Thimmapuram: సొంత స్థలంలో ఫిల్మ్ నగర్ భవనం గంటా

Thimmapuram: విశాఖలో సొంత స్థలంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 29 Sept 2026 10:31 PM IST
Thimmapuram
X

Thimmapuram: సొంత స్థలంలో ఫిల్మ్ నగర్ భవనం గంటా

తిమ్మాపురం: ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ భవనాన్ని సొంత స్థలంలో నిర్మించడానికి సంపూర్ణ సహకారం అందజేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా సోమవారం సెంటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ఒక మంచి సంప్రదాయానికి తెర తీశారన్నారు.

2014- 19 లో 5 ఎకరాల భూమిని ఫిల్మ్ నగర్ సెంటర్ కోసం కేటాయించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అమలు కాలేదని చెప్పారు. సీఎం దృష్టికి తీసుకువెళ్లగా స్థలం కేటాయింపు కొలిక్కి వచ్చిందని, కొత్త కమిటీ నేతృత్వంలో అత్యుత్తమ భవన నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులో నిర్మించబోయే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో వాల్తేర్ క్లబ్, గోల్ఫ్ క్లబ్ లకు ధీటైన ప్రమాణాలను పాటించాలని సూచించారు.

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సభ్యుడిగా చెప్పుకోవడం స్టేటస్ గా మారే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. కుటుంబాలు పాల్గొనేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సబ్ కమిటీలను నియమించి సభ్యులు భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలని పేర్కొన్నారు. ఐటీ, టూరిజం హబ్ గా మారుతున్న విశాఖలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ప్రాముఖ్యం విశేషంగా పెరుగుతుందని చెప్పారు. ఉత్తరం ఎమ్మెల్యే పి.విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ స్థాయిని పెంచడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ గౌరవ చైర్మన్ గా గంటా

2026-28 రెండేళ్ల కాలానికి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ చైర్మన్ గా గంటా శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు, ఉపాధ్యక్షుడిగా ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్, కార్యదర్శిగా జాస్తి శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా ఈ. అశోక్ కుమార్, కోశాధికారిగా ఎన్.ఆర్.కె. రెడ్డి, సభ్యులుగా జి.ఎస్.ఎస్.ఎన్. రాజు, ఎ.ఎల్.ఎన్. రాజు, బి.ఎన్.వి. మణికంఠ, కె.వెంకటేశ్వరరావు, ఎ. కాశీ విశ్వేశ్వరరావు, వి. వెంకటపతిరాజు, పి. వెంకటబాబు, వి.వి. మహేశ్వరరెడ్డి, ఎస్. సూర్యనారాయణ రాజు, కె.నరేంద్రకుమార్ ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గానికి ఎమ్మెల్యే గంటా అభినందనలు తెలియజేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.