Devarapalli: జీపీఎస్ ట్రాకర్‌తో పులి కదలికలు పర్యవేక్షిస్తున్న అటవీశాఖ అధికారులు!
Devarapalli: దేవరపల్లి మండలం గౌరీపట్నం సమీపంలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ ముమ్మర గాలింపు. జీపీఎస్ ట్రాకర్ ద్వారా కదలికల పర్యవేక్షణ.
Devarapalli: జీపీఎస్ ట్రాకర్‌తో పులి కదలికలు పర్యవేక్షిస్తున్న అటవీశాఖ అధికారులు!
Devarapalli: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం మేరీమాత ఆలయం సమీపంలోని క్వారీల్లో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పులి మెడకు అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా దాని కదలికలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతూ, మత్తు ఇంజెక్షన్ ద్వారా బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలను అటవీశాఖ, ఇతర శాఖల అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. క్వారీలు, పొలాలు, అటవీ ప్రాంతాల సమీపంలోకి వెళ్లేటప్పుడు ప్రజలు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని మైక్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.
రెండు రోజుల క్రితం సీతానగరం మండలం వైపు నుంచి గోదావరి దాటి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం గౌరీపట్నం పరిసరాల్లో దాని కదలికలు గుర్తించడంతో ప్రత్యేక బృందాలు అప్రమత్తమయ్యాయి.
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు క్వారీ, క్రషర్స్ యూనియన్ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్ ఆండ్రు అనిల్ పులి సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకుని అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
బోను, యాంటెన్నా తదితర పరికరాల సహాయంతో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకర్‌టై, రేంజ్ అధికారి దావీదుతో పాటు ఆర్ఆర్‌ఆర్, అటవీశాఖ బృందాలకు చెందిన సుమారు 30 మంది సిబ్బంది పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. పులిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.




