Visakhapatnam: వలందపేట బాణసంచా పేలుడు: క్షతగాత్రులకు రవితేజ పరామర్శ
Visakhapatnam: విశాఖ వలందపేటలో బాణసంచా పేలుడులో గాయపడిన నలుగురు చిన్నారులను టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ ఆసుపత్రుల్లో పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Visakhapatnam: వలందపేట బాణసంచా పేలుడు: క్షతగాత్రులకు రవితేజ పరామర్శ
విశాఖపట్నం: దసరా ఉత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో విశాఖపట్నంలోని 2వ వార్డులో వలందపేట బాణసంచా పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడటంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ గురువారం ఆసుపత్రులను సందర్శించి, చికిత్స పొందుతున్న చిన్నారులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ ప్రమాదంలో చిల్లా గౌతమ్ (8), చిల్లా సుశాంత్ (5), బాకి కార్తికేయ (5), సరగడ సన్ముఖ్ సాయి (10) గాయపడ్డారు. వీరికి అపోలో ఆసుపత్రి (అరిలోవ), ఎన్ఆర్ఐ ఆసుపత్రి (సంగివలస), అపూర్వ ఆసుపత్రి (సీతమ్మధార), ఆయుష్మాన్ ఆసుపత్రి (కేజీహెచ్ ఎదురుగా)ల్లో చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రులకు వెళ్లిన గంటా రవితేజ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
అనంతరం సంబంధిత వైద్యులతో మాట్లాడి, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని కోరారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మెరుగైన చికిత్స అందేలా చూడాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు.
పండుగ వేళ చిన్నారులు ప్రమాదానికి గురికావడం బాధాకరమని పేర్కొంటూ, బాణసంచా వినియోగంలో తల్లిదండ్రులు, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గంటా రవితేజ సూచించారు. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు.




