Gajuwaka: ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి: పల్లా శ్రీనివాసరావు
Gajuwaka: గాజువాకలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తో సమగ్రాభివృద్ధి సాధ్యమని, 22 మంది కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
Gajuwaka: ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి: పల్లా శ్రీనివాసరావు
గాజువాక: రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం గాజువాక నియోజకవర్గంలో 270 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగింపు నేపథ్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కూటమి నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 22 మంది కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యతను కూటమి శ్రేణులన్నీ భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ పైన ఉన్న నమ్మకంతోనే పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని, ప్రజలంతా ఆలోచించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు.
గత ఐదేళ్ల వైసిపి పాలన కేవలం కక్ష సాధింపులు, విధ్వంసానికే పరిమితమైందని తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాయకుల ఇళ్లు, ఆస్తులు, కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వైసిపి నేతలు చెలరేగిపోయారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చి చెప్పిందే చేశామని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే 4వేల పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టామని, ఈ రోజు ఎక్కడికి వెళ్లినా మహిళలు ఈ పథకాలను ప్రశంసిస్తూ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల వచ్చిన ప్రమాదకరమైన తుఫాన్లను కూడా ప్రభుత్వం ముందు చూపుతో, అన్ని శాఖలను సమన్వయం చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను కాపాడిందని ఆయన గుర్తుచేశారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త, డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, బిజెపి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త కరణం రెడ్డి నరసింగరావు, టిడిపి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సర్వసిద్ధి అనంతలక్ష్మి, టిడిపి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త పల్లా రమణ, టిడిపి నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు తమిరె శివప్రసాద్, బిజెపి గాజువాక మండలాధ్యక్షుడు గూటూరు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.




