Bheemili: మేయర్ ను రికార్డు మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే గంటా

Bheemili: జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణిని రికార్డు మెజారిటీతో గెలిపించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

SHIVA, BHIMILI
Published on: 20 Oct 2026 8:37 PM IST
Bheemili
X

Bheemili: మేయర్ ను రికార్డు మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే గంటా

భీమిలి: జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డులతో పాటు మేయర్ స్థానాన్ని రికార్డ్ మెజారిటీతో గెలిపించుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గంలోని 13 కార్పొరేటర్ అభ్యర్థులతో మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం భీమిలి కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. 2021 జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు ఎదురు నిలిచి 26 వార్డు కార్పొరేటర్ గా విజయం సాధించారని శ్రావణిని ప్రశంసించారు. విశాఖ ప్రజలు టీడీపీకి వెన్నంటి ఉంటారని, 2019 లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. నగరానికి నాలుగు దిక్కులైన తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ స్థానాల్లో పట్టం కట్టారని పేర్కొన్నారు.

హుద్ హుద్ తుపాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన నిబద్ధతను విశాఖ ప్రజానీకం ఎప్పటికీ మర్చిపోరన్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున వార్డుల్లో విస్తృతంగా పర్యటించి సాధ్యమైనన్ని ఎక్కువ ఇళ్లను సందర్శించాలని సూచించారు. మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి మాట్లాడుతూ 2021 లో నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో బీఫాం తీసుకుని కార్పొరేటర్ గా విజయం సాధించానన్నారు.

ఇప్పుడు గంటా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం విజయానికి సెంటిమెంట్ గా భావిస్తున్నానని తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థులు ఇప్పాక వరలక్ష్మి, గరే సదానంద, గాడు చిన్ని కుమారి లక్ష్మి, పాసి సుస్మిత, మన్యాల సురేష్, బోయి రమాదేవి, పిల్లా రేవతి, నాగోతి రూపాదేవి, గరే జ్యోతి, చెట్టుపల్లి గోపీ, సారిపల్లి శ్రీనివాస్, పీవీ నరసింహం, గరికిన సుధ, పరిమి భువనేశ్వరి, శంకర్ తదితరులను మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి గంటా పరిచయం చేశారు. భీమిలి జనసేన ఇంచార్జ్ పంచకర్ల సందీప్, యువ నాయకులు గంటా రవితేజ, చిక్కాల విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

శివానందాశ్రమంలో గంటా, ముక్కా శ్రావణి

భీమిలిలోని సద్గురు శివానందమూర్తి ఆశ్రమాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి సందర్శించారు. ఆశ్రమంలో నిర్వహించిన చండీ హోమంలో పాల్గొన్నారు. అష్టలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అర్చక స్వాముల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అనంతరం సద్గురు ధ్యాన మందిరాన్ని సందర్శించారు. అనంతరం మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జనసేన భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్, యువ నాయకులు గంటా రవితేజ, గొలగాని నరేంద్ర, కొప్పల రమేష్, తమ్మిన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI