Visakhapatnam:రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు డీజేలపై నిషేధం!
Visakhapatnam: నిబంధనలు మీరి అధిక శబ్దాలతో డీజేలు నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేసి పరికరాలను సీజ్ చేస్తామని విశాఖ ఈస్ట్ ఏసీపీ కే. లక్ష్మణమూర్తి హెచ్చరించారు.
Visakhapatnam:రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు డీజేలపై నిషేధం!
Visakhapatnam: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా డీజే నిర్వాహకులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని విశాఖ ఈస్ట్ ఏసీపీ కే. లక్ష్మణమూర్తి స్పష్టం చేశారు. శుక్రవారం ఈస్ట్ ఏసీపీ కార్యాలయంలో డీజే యజమానులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు జారీ చేశారు.
డీజేల వల్ల వెలువడే అధిక శబ్దాల కారణంగా ఎవరికైనా ప్రమాదం జరిగినా లేదా ప్రాణనష్టం సంభవించినా అందుకు పూర్తి బాధ్యత డీజే యజమానులదేనని, వారిపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఏసీపీ లక్ష్మణమూర్తి హెచ్చరించారు. పరిమితికి మించి శబ్దం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందితే తక్షణమే డీజే పరికరాలను స్వాధీనం చేసుకుంటామని, పట్టణ ఇబ్బందుల నివారణ చట్టం, భారతీయ న్యాయ సంహిత మరియు ప్రజా భద్రతా చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే ర్యాలీలు, ఊరేగింపుల సమయంలో డీజే శబ్దాలకు నృత్యాలు చేస్తూ రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే నిర్వాహకులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేని వేడుకలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను వినియోగించరాదని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాలలో పగటిపూట 55 డెసిబెల్స్, రాత్రిపూట 45 డెసిబెల్స్ కంటే శబ్ద తీవ్రత మించకూడదని సూచించారు. అంతేకాకుండా కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి డీజేలు, లౌడ్ స్పీకర్లు వాడరాదని ఏసీపీ లక్ష్మణమూర్తి హెచ్చరించారు.




