Anakapalle: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలి!

Anakapalle: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలని, నూతన ఎస్ఎంసి కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 1 Oct 2026 10:13 AM IST
Anakapalle
X

Anakapalle: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలి!

Anakapalle: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నూతన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) చైర్మన్లు, వైస్‌చైర్మన్లకు సూచించారు.

అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన SMC ఎన్నికల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్లుగా ఎన్నికైన వారికి అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో అభినందన, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వయంగా నూతన కమిటీ సభ్యులను సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా SMCలు పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, నాణ్యమైన బోధనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

విద్యతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, క్రీడలు, యోగా, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. SMC సభ్యులు తరచూ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలు, మధ్యాహ్న భోజనం, బోధన, మౌలిక వసతులను పర్యవేక్షించాలని కోరారు.

మంచి పనితీరు కనబరుస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించాలని, తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ మొబైల్ వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. పిల్లలకు మంచి నడవడికను నేర్పేందుకు తల్లిదండ్రులే ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.

పాఠశాలలను ఆధునిక దేవాలయాలుగా భావించి గ్రామస్తులు, తల్లిదండ్రులు, దాతల సహకారంతో మరింత అభివృద్ధి చేయాలని కొణతాల పిలుపునిచ్చారు. నూతన కమిటీలు పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావించి పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, అనకాపల్లి జిల్లా బీజేపీ నాయకురాలు ఓరగంటి నాగమణి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI