Anakapalli: సమస్య పరిష్కారం కాకపోతే తహశీల్దార్ కార్యాలయం వద్ద వంటా వార్పు!

Anakapalli: అనకాపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో గొలగాం భూ బాధితుల ధర్నా.. 137/3 సర్వే నంబర్ భూములను 22ఏ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన జి.కోటేశ్వరరావు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 17 Sept 2026 2:53 PM IST
Anakapalli
X

Anakapalli: సమస్య పరిష్కారం కాకపోతే తహశీల్దార్ కార్యాలయం వద్ద వంటా వార్పు!

Anakapalli: చట్టబద్ధంగా కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి భూ యజమానులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. గొలగాం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 137/3 భూములను 22A నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం అనకాపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బాధిత భూ యజమానులతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. 2012లో సమృద్ధి వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసి, సబ్బవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూ యజమానులకు ప్రస్తుతం తమ భూములను వినియోగించుకునే హక్కు లేకుండా చేయడం అన్యాయమన్నారు. అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సంబంధిత భూములకు ఎన్‌ఓసీ కూడా జారీ అయిందని తెలిపారు.

అయినప్పటికీ ప్రస్తుతం ఆ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

బాధిత భూ యజమానుల వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్‌ఓసీ తదితర ఆధారాలను పరిశీలించి వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. భూముల వాస్తవ పరిస్థితిని నిర్ధారించి, అర్హులైన భూ యజమానుల భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రజల సొంత భూముల విషయంలో అధికారులు కాలయాపన చేస్తే సహించేది లేదని, సమస్య పరిష్కారం అయ్యే వరకు బాధితుల పక్షాన సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని జి.కోటేశ్వరరావు స్పష్టం చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే తహశీల్దార్ కార్యాలయం వద్ద వంటా వార్పు నిర్వహించి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నాలో సీపీఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు, అనకాపల్లి మండల కన్వీనర్ గంట శ్రీరామ్, గాజువాక జోన్ నాయకులు డి.రమణ, గొలగాం గ్రామ భూ యజమానులు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI