Visakhapatnam: విశాఖలో సీపీఎం ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ యాత్ర నిర్వహణ!

Visakhapatnam: విశాఖలో సీపీఎం ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ యాత్ర. ప్రజా హామీలు అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీపీఎం నేతలు.

JAI RAM, MADURAWADA
Published on: 11 Oct 2026 2:45 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో సీపీఎం ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ యాత్ర నిర్వహణ!

విశాఖపట్నం: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని సీపీఎం జోన్ కమిటీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, ప్రజలపై పడుతున్న అదనపు ఆర్థిక భారాలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించారు.

రాజీవ్ గృహకల్ప కొత్త భవనాల వద్ద సీపీఎం సీనియర్ నాయకుడు బి. నరసింహమూర్తి యాత్రను ప్రారంభించారు. రాజీవ్ గృహకల్ప పాత, కొత్త కాలనీలతో పాటు శారదా నగర్, పీపీ-2 కాలనీ, వైఎస్సార్ నగర్, వికలాంగుల కాలనీ, కార్పెంటర్ కాలనీ, స్వయంకృషి నగర్, అయ్యప్ప నగర్, శ్రీలక్ష్మీ నగర్, వివేకానంద నగర్, ముత్యాలమ్మ కాలనీ, శివశక్తి నగర్, బొట్టవానిపాలెం, స్వతంత్ర నగర్ తదితర ప్రాంతాల్లో యాత్ర కొనసాగింది. శారదా నగర్, వైఎస్సార్ నగర్, కొమ్మాది, కూడలి ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు డి. అప్పలరాజు మాట్లాడుతూ.. పలు ప్రాంతాల్లో తాగునీరు సక్రమంగా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సరఫరా అవుతున్న నీరు కూడా కొన్ని ప్రాంతాల్లో కలుషితంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నిరంతరం క్రమశిక్షణతో, నిజాయతీగా పోరాటాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు తమ పోరాటాలకు మద్దతుగా నిలవాలని, ప్రజలకు ద్రోహం చేసే రాజకీయ పార్టీలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జోన్ నాయకులు పి. రాజశేఖర్, పి. రాజుకుమార్, వెంకటరావు, జి. కిరణ్, డి. కొండమ్మ, బి. అప్పలరెడ్డి, బి. భారతి, బి. భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA