Anakapalli: అనకాపల్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన సీపీఐ నాయకులు!

Anakapalli: అనకాపల్లిలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల జంక్షన్‌లో భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 28 Sept 2026 2:11 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన సీపీఐ నాయకులు!

Anakapalli: అనకాపల్లి, నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే నియంత్రించి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సీపీఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో అనకాపల్లిలో వినూత్న నిరసన చేపట్టారు.

అనకాపల్లి నెహ్రూ చౌక్ నాలుగు రోడ్ల జంక్షన్‌లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై కూర్చొని భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో సామాన్యుల జీవనం భారంగా మారిందనే అంశాన్ని వినూత్న రీతిలో ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా రాజాన దొరబాబు మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. పప్పులు, వంట నూనెలు, కూరగాయలు, వంటగ్యాస్ తదితర వస్తువుల ధరల పెరుగుదలతో కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

ప్రజలపై పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ధరల నియంత్రణకు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా మార్కెట్‌పై సమర్థవంతమైన పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలి

నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాన దొరబాబు కోరారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టి, నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

ఆర్డీఓకు వినతిపత్రం నాలుగు రోడ్ల జంక్షన్‌లో నిరసన అనంతరం సీపీఐ నాయకులు ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ అనకాపల్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు బి. పరమేశ్వరి, అనకాపల్లి మండల కార్యదర్శి వియ్యపురాజు, పరవాడ మండల కార్యదర్శి కే. త్రినాథ్, సీనియర్ నాయకులు కాసుబాబు, కోరిపల్లి శంకర్రావు, వీరాచారి, పప్పల ఈశ్వరరావు, కే. సత్తిబాబు, బి. సురేష్, బి. వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI