Visakhapatnam: విశాఖలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు కోరుతూ కాంగ్రెస్ నిరసన!
Visakhapatnam: విశాఖపట్నంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'వోట్ చోర్ గద్దీ చోడ్' నిరసన చేపట్టారు.
Visakhapatnam: విశాఖలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు కోరుతూ కాంగ్రెస్ నిరసన!
Visakhapatnam: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, ఆయనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం విశాఖలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డాల వెంకట వర్మరాజు ఆధ్వర్యంలో ‘వోట్ చోర్ గద్దీ చోడ్’ రెండో దశ నిరసనలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం కూడా ఆందోళన చేపట్టారు.
అనంతరం గాంధీ విగ్రహం నుంచి పాత జైలు రోడ్డు మీదుగా ఇందిరాగాంధీ విగ్రహం వరకు నల్ల బెలూన్లు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు వేగి వెంకటేష్ మాట్లాడుతూ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో వివిధ పదవుల్లో పనిచేసిన సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే అధికారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు లక్కరాజు రామారావు, పీసీసీ జనరల్ సెక్రటరీ గడమ్ మహెద్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునంద, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సోడదాసి సుధాకర్, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామకృష్ణ, దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.వి. సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.




