Paderu: పాడేరులో జీటీడబ్ల్యూఏ పాఠశాలను సందర్శించిన కలెక్టర్!

Paderu: అల్లూరి జిల్లా పాడేరు మండలం బంధవీధి జీటీడబ్ల్యూఏ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ నిశాంతి.. ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం.

SAI, PADERU
Published on: 19 Sept 2026 5:53 PM IST
Paderu
X

Paderu: పాడేరులో జీటీడబ్ల్యూఏ పాఠశాలను సందర్శించిన కలెక్టర్!

Paderu: పాడేరు, జి.మాడుగుల మండలం బంధవీధి గ్రామంలోని GTWA పాఠశాలను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని స్కూల్ క్లస్టర్ కాంప్లెక్స్‌ను పరిశీలించి, ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఉపాధ్యాయుల్లో కనీస బోధనా నైపుణ్యాలను మరింతగా పెంపొందించేందుకు ప్రతి నెల 3వ మరియు 4వ శనివారాల్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణను నిర్వహించారు. “చిన్న వయసులో వేసే పునాది జీవితాంతం గుర్తుండిపోతుంది”. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ శ్రీమతి నిశాంతి మాట్లాడుతూ, పిల్లలకు చిన్న వయసులోనే అందించే విద్య, బోధించే విలువలు, వేసే మంచి పునాది వారి జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు.

తాను కూడా చిన్నతనంలో బోధించిన ఉపాధ్యాయులను, వారి పేర్లతో సహా ఇప్పటికీ గుర్తుంచుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల స్థాయి ఉపాధ్యాయులను తప్పకుండా గుర్తు చేసుకుంటారని చెప్పారు. “ఒక విద్యార్థి జీవితంలో మంచి పునాది వేయడం కంటే ఉపాధ్యాయుడికి గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు” అని కలెక్టర్ పేర్కొన్నారు. 100 శాతం ఫలితాల దిశగా పనిచేయాలి.

ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను నిరంతరం సమీక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే బాగా బోధిస్తున్న ఉపాధ్యాయులు మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని, 100 శాతం సాధించిన వారు 120 శాతం లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.

తక్కువ స్థాయి ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయులు తమ బోధనా విధానాలను విశ్లేషించుకుని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేలా ప్రత్యేక దృష్టి సారించి మెరుగుపడాలని సూచించారు. అదేవిధంగా మంచి పనితీరు కనబరుస్తున్న ఉపాధ్యాయులను తగిన విధంగా గుర్తించి ప్రోత్సహిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

కలెక్టర్ ప్రసంగం ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని నింపింది. తమ బోధనా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకుని విద్యార్థుల అభ్యసన ఫలితాలను పెంచేందుకు కృషి చేస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, ఆర్డీఓ శ్రీ భుజంగరావు, జిల్లా విద్యాశాఖాధికారి, ఇతర విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU